Vijayawada Multiplex: విజయవాడ: షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్లాలంటేనే సామాన్యులు జేబు చూసుకుంటారు. అయితే బయట తక్కువ ధరకు దొరికే ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ పెద్ద మాల్స్, మల్టీప్టెక్స్ లలో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారని అటువైపు వెళ్లాలంటేనే చాలా మంది జంకుతారు. అలాంటిది ఎక్కువ ఖర్చుపెట్టి కొన్ని తిను పదార్థాలు నాసిరకంగా ఉండటం, బూజు పట్టి ఉండటం విజయవాడలో జరిగింది. ప్రముఖ మల్టీప్లెక్స్ లో బూజుపట్టిన సమోసాలు అని ఓ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


విజయవాడలోని ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ లో సినిమా చూడడానికి వెళ్లిన మహిళ.. ఇంటర్వెల్ టైంలో అదే థియేటర్లో సమోసాలు కొన్నారు. సమోసా తినబోతుండగా వాటిలో బూజు కనపడడం  కలకలం రేపింది. ఎక్కువ ధర పెట్టి కొన్నా కూడా అవి పూర్తిగా చెడిపోయి, వాసన వస్తున్నాయంటూ ఆమె చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మహిళ ఆరోపణలు చెయ్యడం మాత్రమే కాకుండా... ఇతర కస్టమర్స్ కు కూడా ఆ సమోసాను చూపించి అడగగా, వారు సైతం అవి వాసన వస్తున్నాయని చెప్పారు. దాంతో ఆమె వ్యక్తిగత అభిప్రాయం కాదని, నిజంగా సమోసాలు పాచిపోయాయని అర్థమవుతోంది. చాలా ఎక్కువ ధర తీసుకుంటూ ఇలా పాడైపోయిన సమోసాలు ఎందుకు విక్రయిస్తున్నారు. అవి తింటే ఆరోగ్యం చెడిపోదా అని ఆ కాంటీన్ వారిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదంటూ ఆ మహిళ తన వీడియోలో పేర్కొన్నారు. మహిళ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. చెడిపోయిన సమోసాలు ముఖ్యంగా చిన్నారులు తింటే వారి ఆరోగ్యం ఏమవుతుంది అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



అప్రమత్తమైన అధికారులు.. థియేటర్ కు నోటీసులు
బూజుపట్టిన సమోసాలు అని సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు యాక్టివ్ అయ్యారు. ఇంత జరుగుతున్నా, వినియోగదారులను దోచుకుంటూ, నాసిరకం తిను బండారాలు విక్రయిస్తున్న మల్టీప్లెక్స్ పై చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ మల్టీ ప్లెక్స్ లో సోదాలు చేశారు. అయితే తాము చెకింగ్ కు వెళ్లేసరికి బూజుపట్టిన సమోసాలు, నాసిరకం తిను పదార్థాలు అక్కడ లేవని అధికారులు చెబుతున్నారు. ఆ మల్టీప్లెక్స్ కాంటీన్ వాళ్లు బయట నుంచి రూ.20కి అలా కొనుక్కొచ్చి, ఇక్కడికి తీసుకొచ్చి రూ.100కు పైగా ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. బయట నుంచి కొని తెచ్చిన వాటిలో కొన్ని సమోసాలు చెడిపోయి ఉంటాయంటూ క్యాంటిన్ సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. దాంతో పూర్తి స్థాయి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చామని చెబుతూనే సమాసాలు వంటి పదార్థాలను ఉదయం, మధ్యాహ్నం  లేటెస్ట్ ఐటమ్స్ మాత్రమే అమ్మకానికి పెట్టాలని... లేకుంటే కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని మల్టీప్లెక్స్ యాజమాన్యాన్ని హెచ్చరించినట్టు ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గౌస్ తెలిపారు.


ఎవరీ మహిళ?
అయితే సోషల్ మీడియా లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఆ మహిళ ఎవరనేదానిపై స్పష్టత రాలేదు. అయితే ఈ వీడియో శ్రీలత పొట్లూరి అనే ఫేస్ బుక్ అకౌంట్ నుండి అప్లోడ్ అయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.