Actor Ali: రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న మూడు సెంట్ల ఇంటి స్టలాన్ని అర్హులైన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ హాస్యనటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు మహమ్మద్ అలీ కోరారు. బుధవారం ఆయన విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు, ఇంటి స్థలం గురించి మీడియా మిత్రులు చాలా సార్లు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
సీఎం జగన్‌ను తాను కలిసినప్పుడు జర్నలిస్టులు పడుతున్న సమస్యల గురించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించినట్లు చెప్పారు. చాలా మంది జర్నలిస్టులు ఇంటి స్థలం లేక బాధపడుతున్నారని, వారికి న్యాయం చేయాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యలు విన్న సీఎం ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే క్యాబినెట్లో ఆ అంశాన్ని పెట్టి ఆమోదదం తెలిపారని అన్నారు. సీఎం జగన్ మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు.
ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా తన వినతులను సీఎం అంగీకరించారని, మీడియాకు మంచి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన జగన్, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించి వారి మనసుల్లో కూడా స్థానాన్ని పొందారని అలీ తెలిపారు. మూడు సెంట్ల స్థలం కేటాయింపు గురించి త్వరలోనే విధివిధానాలు వస్తాయని, అర్హులైన వారందరికి ప్రయోజనం చేకూరుతుందని అలీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను కేబినెట్ భేటీ అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు.
కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 38 ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో కులగణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే జర్నలిస్టులకు ఈ సమావేశంలో శుభవార్త అందించింది. జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రిమండలి సభ్యులు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్ నిర్ణయంపై జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. పాత్రికేయుల కష్టాలను ఇప్పటికైనా గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించడం సంతోషించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు జర్నలిస్ట్ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత జర్నలిస్టులకు ఏ ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు కేటాయించలేదన్నారు.