బెజవాడలో డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం రవాణా జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహరం పై పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ వాడకానికి సంబందించిన వ్యవహరంలో రకరకాలుగా జరుగుతున్న ప్రచారాలపై పోలీసు శాఖ అధికారులు కూడా స్పందించి అందుకు సంబంధించిన వ్యవహరంపై క్లారిటీ ఇచ్చారు.


అసలు విషయం ఇది


ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాధారణ తనిఖీలలో బాగంగా ఈ నెల 29వ తదీన  కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో పోలీసులకు ఊహించని సమాచారం లభించింది.  తూర్పుగోదావరి జిల్లా, రాజవోలు, అభ్యుదయ కాలనీకి చెందిన 22 సంవత్సరాల నడింపల్లి అభిషేక్ వర్మ అనుమానాస్పదంగా పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారించగా పొంతన లేని సమాచారం చెప్పారు. దీంతో అభిషేక్ వర్మను అదుపులోకి తీసుకొని విచారించగా, అతని వద్ద నుండి 3.42 గ్రాముల కవర్ తో సహా MDMA (Methylenedioxy Methamphetamine) స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.


వెంటనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ వర్మ 2020 సంవత్సరం లో బీటెక్ వరకు చదువుకునాడు, బీటెక్ చదివే సమయంలో గంజాయి తాగే అలవాటు పడ్డాడు. గత ఆరు నెలలుగా అభిషేక్ వర్మ ఇతని స్నేహితులతో కలిసి గంజాయితో పాటుగా, MDMA డ్రగ్ తాగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. గంజాయిని  రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో  కొనుగోలు చేసి వాటిని వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. గత కొంతకాలంగా తన చిన్న నాటి మిత్రుడు MDMA డ్రగ్ అమ్ముతున్నట్లు తెలిసి, అతని వద్ద కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు. MDMA డ్రగ్ ను అతను  బెంగళూరు లో  తెలిసిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రాజమండ్రి కి సరఫరా చేస్తున్నాడు.  అతను కుడా రాజమండ్రి లో నివాసం ఉంటున్నాడు. MDMA డ్రగ్ తీసుకురావడానికి బెంగళూరు కు రాకపోకలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో అభిషేక్ వర్మ తనతో పాటుగా తన స్నేహితులు తాగడానికి MDMA డ్రగ్ లేకపోవడంతో దానిని కొనుగోలు చేయాలని ఈనెల 27 వ తేదీన అభిషేక్ వర్మ తన చిన్ననాటి స్నేహితుడుకి ఫోన్ చేసి MDMA డ్రగ్ కావాలని ఆర్డర్ చేశాడు.


బెంగుళూరు టు రాజమండ్రి వయా విజయవాడ


దీంతో బెంగుళూరు  కు వస్తే ఇస్తానని చెప్పగా అభిషేక్ వర్మ అదే రోజు రాజమండ్రి నుంచి బస్సులో బయలుదేరి బెంగళూరు చేరుకున్నాడు.  చిన్ననాటి స్నేహితుడికి రూ.10 వేలు రూపాయలు ఇచ్చి సుమారు 3.42 గ్రాములు డ్రగ్స్  కొనుగోలు చేసి తిరిగి రాజమండ్రి తీసుకు వెళ్ళే క్రమంలో విజయవాడ బస్టాండ్ లో పోలీసులను చూసి పారిపోబోయాడు.


బెజవాడకు డ్రగ్స్ తో సంబంధం లేదు


డ్రగ్స్ కేసుకు విజయవాడకు ఎటువంటి సంబంధం లేదని నగరంలో ఎక్కడా డ్రగ్స్ ఆనవాళ్ళు లేవని పోలీసులు తెలిపారు.  కేవలం రాజమండ్రికి చెందిన వ్యక్తి డ్రగ్స్ కోసం బెంగుళూరు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తిరిగి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్తున్న సమయంలో విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో పోలీస్ లు అడుపులోనికి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు.


సోషల్ మీడియా పోస్ట్ లు నమ్మెద్దు


విజయవాడలో డ్రగ్స్ కలకలం అంటూ అని సోషల్ మీడియాతో పాటుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం  అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ముద్దాయి గాని, అతను డ్రగ్ కొన్న ప్రదేశం గాని, తీసుకు వెళుతున్న ప్రదేశం గాని విజయవాడ కాదని అన్నారు.