విజయవాడలో గురువారం నుంచి పుస్తకాల పండుగ ప్రారంభం కానుంది. రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు.
ఫిబ్రవరి 9 నుంచి పుస్తక మహోత్సవాలు...
ఈనెల తొమ్మిది నుంచి 19వ వరకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల గ్రౌండ్‌లో 33వ విజయవాడ పుస్తక మహోత్సవ్‌ నిర్వహించనున్నట్లు బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ గౌరవాధ్యక్షులు వి.విజయకుమార్‌, బి.బాబ్జి తెలిపారు. పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరిచందన్‌  ప్రారంభిస్తారని, విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారని చెప్పారు. 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మొగల్‌రాజపురంలోని పిబి సిద్ధార్ద కళాశాల నుంచి బెంజిసర్కిల్‌ మీదుగా పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక ప్రదర్శన, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, సదస్సులు ఉంటాయన్నారు. విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. 
పది శాతం రాయితీలు...
పుస్తక మహోత్సవ్‌ లోని అన్ని స్టాల్స్‌లో పుస్తకాలపై పది శాతం రాయితీని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రదర్శనలో సుమారు 120కిపైగా పబ్లిషర్స్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారని, వీరి కోసం 250 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా జరిగే పుస్తక మహోత్సవాలకు బుక్ లవర్స్ నుండి మంచి ఆదరణ లభిస్తుంది, దీంతో క్రమం తప్పకుండా పుస్తక ప్రదర్శన ను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు శ్రమిస్తున్నారు.. 
కరోనా తరువాత నుంచి కష్టాలు.....
పుస్తక మహోత్సవాలను కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఆపేశారు. దీంతో పుస్తక ప్రియులు నిరాశకు గురయ్యారు. ఆ తరవాత నుంచి పుస్తక మహోత్సవానికి ఆటంకాలు మెదలయ్యాయి. ప్రతి ఏటా విజయవాడ స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవాన్ని జనవరి ఒకటి నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలు బ్రేక్ పడింది. ఆ తరువాత నుండి స్వరాజ్య మైదానాన్ని ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. భారీ స్థాయిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ ఖళీ లేకపోవటంతో, గత ఎడాది పుస్తక మహోత్సవాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది కూడ పుస్తక మహోత్సవం నిర్వాహణ పై నీలి నీడలు కమ్ముకున్న క్రమంలో్ విజయవాడ నగరం మధ్య లో ఉన్న చుట్టుగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల గ్రౌండ్‌లో 33వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ఎట్టకేలకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రతి ఏటా జనవరి 1నే ప్రారంభం కావాల్సిన పుస్తక ప్రియుల పండగ నెల రోజులు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది.
సాహిత్యానికి వేదిక....
విజయవాడ లో నిర్వహించే పుస్తక మహోత్సవానికి ప్రత్యేకత ఉంది. పుస్తక మహోత్సవాల్లో నిర్వహించే సాహితీ వేత్తల చర్చా గోష్టులు, ముఖాముఖి కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొంటారు. దీని వలన యువ సాహితీ వేత్తలకు, పుస్తక ప్రియులకు అపూర్వమయిన విజ్ణాన సంపద లభిస్తుంది.అంతే కాదు పుస్తక ప్రియుల పాదాయాత్ర ద్వార, పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తిని పెంచుతుంది. సాంకేతిక పరిజ్ణానం పూర్తిగా అరచేతిలోకి వచ్చి, ఫోన్ లోనే సమస్త సమాచారం అందుతున్న నేపద్యంలో పుస్తకానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని చెప్పేందుకు ఇలాంటి పుస్తక మహోత్సవాలు నేటి యువతరానికి స్పూర్తిని అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.