స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఐదు రోజుల పాటు ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది ఏసీబీ కోర్టు.


బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు. తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే ఛాన్స్‌ ఉందన్న న్యాయవాదులు చెప్పడంతో 2.30కి తీర్పును వాయిదా వేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది. ఒకే రోజు రెండు వ్యతిరేక తీర్పులు రావడం టీడీపీ శ్రేణులు నిరాశ చెందాయి. చంద్రబాబును కోర్టులోనే విచారిస్తామని చెప్పింది సిఐడీ. 


ఇదే కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. చంద్రబాబు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారం ముగిసింది. ఈక్రమంలోనే తదుపరి ఆదేశాల కోసం ఆయనను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిలో హాజరు పరిచారు. దీంతో చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 24వ తేదీ వరకు కోర్టు పొడిగించింది.


విచారణలో భాగంగా న్యాయమూర్తితో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితమని చెప్పుకొచ్చారు. తనకు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని అన్నారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందేనని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందన్నారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన అంటూ వివరించారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని అన్నారు. తనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని.. తప్పు నిర్ధారణ కాలేదని వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టాన్ని గౌరవిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే అంటూ బాబు స్పష్టం చేశారు.