తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భార్య చందన ఏపీ పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. తన భర్తను అరెస్టు చేసిన పోలీసులు ఎక్కడ దాచి ఉంచారని ప్రశ్నించారు. మధ్యాహ్నానికి తన భర్త ఆచూకీ పోలీసులు చెప్పకపోతే తాను డీజీపీ కార్యాలయానికి, ఆఫీసు ముందే నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం మానేసి పట్టాభిరామ్‌ను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. తన భర్తను అరెస్టు చేయడం, ఉద్రిక్త పరిస్థితులను చూసి తన కుమార్తె నాన్న కోసం ఏడుస్తుందని చందన ఆవేదన చెందారు.


తన భర్త పట్టాభిని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళారో కూడా తెలీదని చందన ఆవేదన చెందారు. తనకు గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ కు తమ వాళ్ళను పంపినప్పటికీ పట్టాభి ఎక్కడా లేరని చెప్పారు. ఆయనను ఎక్కడ దాచారని చందన ప్రశ్నించారు. ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


నిన్న సాయంత్రం గన్నవరంలో ఉద్రిక్తతలు


ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో నిన్న సాయంత్రం (ఫిబ్రవరి 20) మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నాయి. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు.  దీంతో పాటు వల్లభనేని వంశీపై విమర్శలు చేసిన దొంతు చిన్నా కారుకు కూడా నిప్పుపెట్టారు. అంతకు ముందు గన్నవరం బయలుదేరిన పట్టాభిరామ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. గన్నవరం బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్మిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కీలక నేతలు గన్నవరం రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. దీంతో నిన్న గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. టీడీపీ కార్యకర్తలు, నేతలను అరెస్టు చేస్తున్నారు. 


నా భర్తకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత - పట్టాభిరామ్ భార్య 
పట్టాభిరామ్ ఆచూకీపై ఆయన భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త అక్కడికి వెళ్లారని చందన తెలిపారు. అక్కడ పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారని తెలిసిందన్నారు. కారు డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు కానీ తన భర్త అక్కడ లేరని తెలిపారు.  తన భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలియడంలేదని ఆందోళన చెందారు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోందని, నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత అని చందన అన్నారు.