Chandrababu Pileru Visit: పీలేరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకేనేందుకు ప్రయత్నించటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడలకు ఈ ఘటనలు నిదర్శనమని తెలుగు దేశం పార్టి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకొని, చంద్రబాబు పర్యటన సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అక్రమ కేసులతో పండుగ పూట పుంగనూరు టీడీపీ నేతలను మంత్రి పెద్దిరెడ్డి జైలులో పెట్టించి పెద్ద తప్పు చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధితుల పరామర్శకు వెళ్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి బ్యానర్లు కట్టించడం టీడీపీ బ్యానర్లు చించడం కూడా మరో తప్పని అన్నారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ తో 30 యాక్ట్ నోటీసు ఇప్పించడం అధికార దుర్వినియోగమే అవుతుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.


30 యాక్ట్ అక్కడ ఉన్నా ఉపయోగం లేదు..
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలీస్ యాక్టు 30 ఉన్నా.. యథేచ్ఛగా కోడి పందేలు, జూదాలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. పోలీస్ యాక్టు 30 ఆయా ప్రాంతాల్లో  ఏమైందని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్షాల్ని ప్రజల వద్దకు, బాధితుల వద్దకు వెళ్లకుండా నిరోధించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి మాత్రమే 30 యాక్ట్ ను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజల్ని భయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు యథేచ్ఛగా పాల్పడుతున్నారని, అవన్నీ బయటపడతాయనే భయంతోనే ప్రజలపై, ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఇళ్లను ధ్వంసం చేయిస్తూ, బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరాకాష్టగా ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకొనే కుట్ర చేస్తున్నారని డీజీపీ జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


చంద్రబాబు పర్యటనపై పోలీసులు హై అలర్ట్
ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు చేస్తున్న పర్యటనలను రాజకీయ కుట్రలో భాగంగానే వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ ఫైర్ అవుతున్న నేపద్యంలో పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో చంద్రబాబు పర్యటించనున్నారు. మరి కొద్ది పేపట్లో చంద్రబాబు వస్తారనగానే భారీగా టీడీపీ శ్రేణులు పీలేరుకు వచ్చారు. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున పీలేరులో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక టీడీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ, సెక్షన్ 30 కింద నోటీసులు ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి టీడీపీ శ్రేణులు చేరుకోవటంతో పోలీసుల కూడా ఆయన ఇంటి చుట్టూ మోహరించారు.