వారం పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ నామినేషన్లు వేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా తనపై నమోదు అయిన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి లెటర్ రాశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఆయన రాసిన లేఖ వివరాలు యథాతథంగా... కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రజాసమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు.  ఇలాంటి  సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో నాకు సమాచారం ఇవ్వలేదు.


ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను. నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఏ క్షణలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ  వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను. వ్యక్తి గతంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి మీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. అని లేఖను ముగించారు. ఈ లేఖను రాష్ట్ర డీజీపీతోపాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఎసిబి, సిఐడి విభాగాలకి కూడా చంద్రబాబు పంపించారు. 


రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారని అంటున్నారు.  సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాశారని చెబుతున్నారు.