YSR Congress Party: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాల్సిన డబ్బులను ముందే విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా మరో సంక్షేమ పథకం నిధులను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అవే వైఎస్సార్ చేయూత పథకం నిధులు. ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత డబ్బులను మహిళల అకౌంట్లలో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. జగన్ సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. ఇప్పుటికే మూడు విడతలుగా ఇవ్వగా.. చివరి విడత నిధులను 7న జమ చేయనున్నారు.
ఈ పథకంలో 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉండగా.. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.14, 129 కోట్లు అందించారు. ఎన్నికల వేళ వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నిధులతో పాటు లేఖలు అందించనున్నారు. వైఎస్ జగన్ పేరుతో ఉన్న ఈ లేఖలను మహిళలకు వాలంటీర్లు అందించనున్నారు. ఈ లేఖలో ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చామనే లెక్కలతో పాటు తమ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఎన్నికల సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు వైఎస్సార్ చేయూత నిధులను జగన్ విడుదల చేస్తున్నారు. మహిళల ఓట్లను ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తున్నారు. అనకాపల్లిలో జరిగే సభలో మహిళలకు జగన్ మరిన్ని ఎన్నికల హామీలపై ప్రకటన చేసే అవకాశముందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 7వ తేదీన వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేస్తున్న జగన్.. మహిళలకు వరాలు ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా జగన్ సర్కార్ డ్వాక్రా రుణమాఫీ చేసింది. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంక్‌ను ఆకట్టుకునేందుకు మరోసారి డ్వాక్రా రుణమాఫీపై జగన్ హామీ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ నెల 10వ తేదీన అద్దంకిలో సిద్దం సభకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై దాదాపు కసరత్తు పూర్తైంది. మేనిఫెస్టోను కూడా సిద్దం చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు టాక్ నడుస్తోంది. అలాగే ఆసరా ఫించన్లను రూ.4 వేలకు పెంచడంపై కూడా మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారని సమాచారం. అలాగే రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు ఉండే అవకాశముంది.