టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని, అలాంటి వ్యక్తితో పురంధేశ్వరి సఖ్యతగా ఉండడం ఏంటని నిలదీశారు. అప్పట్లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, చంద్రబాబు అలవాట్లు అన్నీ ఇప్పుడు నారా లోకేశ్‌కు వచ్చాయని ఎద్దేవా చేశారు. లోకేశ్ తేడాగా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు పథకాలు ఇస్తామంటుంటే చంద్రబాబు, లోకేశ్ బూతులు తిడుతున్నారని అన్నారు.
పాతరోజుల్లో ఎన్టీఆర్ ముఖం మీదే చంద్రబాబు చెప్పులు వేయించారని.. అలాంటి ఎన్టీఆర్‌ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటని అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి, ఎన్టీఆర్ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా? అని నిలదీశారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు అని, ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని అన్నారు. విజయవాడలో వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే అని ఆరోపించారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అవినీతిపరుడని అన్నారు. తనపై నరేంద్ర చేసిన ఆరోపణపై బహిరంగ చర్చకు సవాల్ చేస్తున్నానని అన్నారు. గుడిలో ప్రమాణం చేయడానికి కూడా నరేంద్ర సిద్ధమేనా అని ప్రశ్నించారు.
ఇటీవల పుంగనూరులోను పోలీసులను రౌడీలతో చంద్రబాబు కొట్టించారని అన్నారు. సిగ్గులేకుండా పోలీసులను కొట్టించి.. లోకేశ్‌లు పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అడ్డమైన పనులు చేస్తున్నారని విమర్శించారు.