Perni Nanis wife Perni Jayasudha in Ration Rice Missing Case | మచిలీపట్నం: పేర్ని ఫ్యామిలీకి చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. విచారణలో భాగంగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ పేట పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని పేర్ని జయసుధను కోర్టు ఆదేశించింది. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్తే ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో డోర్‌కు నోటీసులు అంటించారు.
బందరు తాలుకా పోలీస్ స్టేషన్ లో విచారణకు పేర్ని జయసుధ హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారని తెలిసిందే. తన లాయర్లతో కలిసి ఆమె విచారణ కోసం పీఎస్ కు వచ్చారు. బందరు తాలుకా పోలీసులు గోదాములో బియ్యం మాయంపై ఆమెను విచారిస్తున్నారు.
పేర్ని ఫ్యామిలీకి వరుస నోటీసులు, విచారణకు మాత్రం డుమ్మా
ఇటీవల పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలోనూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులకు నోటీసులు అతికించారు పోలీసులు. ఆపై కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 12 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కొన్ని గంటల్లోనే పేర్ని నాని పేరును ఈ కేసులో చేర్చారు. బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. ఎన్ని నోటీసులు వచ్చినా పేర్ని నానిగానీ ఆయన కుటుంబసభ్యులు గానీ విచారణకు మాత్రం హాజరు కావడం లేదు. పోలీసుల నోటీసులు బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొడుతున్నారు. దాంతో కేసు విచారణ ముందుకు సాగడం లేదు.