AP CM Chandrababu Reviews Excise Department | అమరావతి: న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపు యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం షాపు యజమానులకు ఇచ్చే కమీషన్‌ను 10.5 నుంచి 14 శాతానికి పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిపిన ఏపీ ఎక్సైజ్ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించాలన్నారు. దీనిపై వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి, 340 షాపులు కేటాయించనున్నారు. టెక్నాలజీ ద్వారా మద్యం అమ్మకాలు ట్రాక్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు


మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం కేటాయించాలని, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులుండగా, 10 శాతం అంటే 340 షాపులు గీత కులాలకు ఇస్తామన్నారు. గౌడ, శెట్టి బలిజ, శెగిడి, గౌండ్ల, కలాలీ, శ్రీసాయన, ఈడిగ, గామల్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు రిజర్వేషన్ కింద 10 శాతం షాపులు కేటాయిస్తారు. ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి షాపులు కేటాయిస్తారు. ఫీజు చెల్లించి ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా ధరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఓ వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల వ్యాలిడిటీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై వివరాలు సిద్ధం చేసిన అధికారులు సమర్పించగా.. అన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నోటిఫికేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


మద్యం షాపు యాజమానుల మార్జిన్ పెంపు
మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే  మార్జిన్ ను ప్రభుత్వం పెంచెంది. ఇప్పటి వరకు మద్యం షాపులకు ఇస్తున్న 10.5 శాతం మార్జిన్‌తో తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని లిక్కర్ షాపు యజమానులు కోరుతున్నారు. తెలంగాణలో ఇచ్చినట్లు ఏపీలో కూడా 14 శాతం మార్జిన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం రూ. 99కి మద్యం అందుబాటులోకి తేవడం, 21 శాతం అమ్మకాలు వీటిపైనే సాగుతున్నాయని చర్చించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 72 శాతం అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చితే ఒక్క బ్రాండ్ తప్ప 19 బ్రాండ్ల రేటు ఏపీలోనే తక్కువ ఉందని గుర్తించారు.



రేట్లు పెంచవద్దన్న చంద్రబాబు
ప్రతి ఏడాది మద్యం అమ్మకాలు పెరుగుతాయని, తక్కువ రేట్లకే అమ్మకంతో ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు తెలిపారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం విక్రయించేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని.. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని సూచించారు. హోలోగ్రామ్ ద్వారా మద్యం ఎక్కడ తయారైంది, ఎక్కడ అమ్ముతున్నారో కూడా తెలుసుకోవాలని.... స్టాక్ వివరాలు తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం ఏపీకి రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 


గత నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు నమోదు చేశాం, 26 వేల లీటర్లు సీజ్ చేశామని అధికారులు తెలిపారు.  బెల్ట్ షాపుల విషయంలో ఉపేక్షించవద్దని, చర్యలు తీసుకోవాలని  సూచించారు. నవోదయం 2.0 పేరుతో మద్యం అక్రమ తయారీని అరికట్టేందుకు, బెల్ట్ షాపులు నియంత్రణకు, మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో మార్పులు తెచ్చే చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Also Read: TGSRTC: సంక్రాంతికి ఊరెళ్లేందుకు బస్సులు రెడీ - తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, పూర్తి వివరాలివే!