Janasena Leader Nagababu News: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకోనున్నారు. ఆయన్ని రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశిస్తే... లేదు మంత్రివర్గంలోకి తీసుకుందామని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీగా ఇచ్చిన మంత్రిని చేయనున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో మాత్రం తెలియడం లేదు.
ఎమ్మెల్సీగా నాగబాబు
2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కూటమి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. అందుకే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి పార్లమెంట్‌కు పంపించాలని పవన్ ఆలోచించారు. ఈ మధ్య ఖాళీ అయిన మూడు సీట్లలో ఒక సీటును నాగబాబుకు ఇవ్వాలని చంద్రబాబుకు పవన్ సూచించారు. ఇప్పటికే ఒక సీటును బీజేపీకి ఇచ్చామని రాజీనామా చేసిన వారిలో ఇంకొకరికి సీటు ఇస్తామని మాట ఇచ్చినట్టు తెలిపారు. ఉన్న ఏకైనా సీటును గత ఎన్నికల్లో ఎంపీ సీటు త్యాగం చేసిన సతీష్‌కు ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు.
కూటమి విజయం కోసం శ్రమించిన నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుందామని పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్సీగా చేసిన ఆయనకు మంత్రిపదవి ఇస్తారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే వాటిని ఇంత వరకు మండలి ఛైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. వీటికి ఆమోద ముద్రపడినా, లేకుంటే మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒక సీటును నాగబాబుకు కేటాయిస్తారు.
ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాక ముందే నాగబాబును మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు ఏదో సభకు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. నాగబాబును కూడా ముందు కేబినెట్‌లోకి తీసుకొని తర్వాత ఎమ్మెల్సీగా మండలికి పంపించనున్నారు.
మంత్రిమండలిలో నాగబాబును తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతంలో నా షో నా ఇష్టం పేరుతో నాగబాబు చేసిన స్కిట్‌లు, ప్రసంగాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి.
నాలుగున్నరేళ్లు బీజేపీతో ఉండి ఎన్నికల ముందు ఆవేశం, ఆగ్రహం అంటూ చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారని నాగబాబు విమర్శలు చేశారు. పాలు మరగడానికి మంట పెట్టాలని చంద్రబాబుకు ఆగ్రహం రావాలంటే ఎన్నికలు రావాలంటూ సెటైర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా వివిధ ఛానల్స్ వేసిన స్టోరీలను ప్లే చేస్తూ తాళాలు వాయిస్తూ చేసిన స్కిట్ చక్కర్లు కొడుతోంది.
సైకిల్‌ను తొక్కితే ఏపీకి మంచిదంటూ చేసిన స్కిట్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ స్కిట్‌లో ఓ పిల్లాడు సైకిల్ తొక్కుతుంటాడు.. మరో వ్యక్తి సైకిల్‌ను కిందపడేసి తొక్కుతుంటాడు. ఎందుకని అడిగితే... ఆరోగ్యం కావాలంటే సైకిల్ తొక్కాలని... ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే సైకిల్‌ను తొక్కాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది ఓ సైకిల్ కంపెనీ కోసం చేసిన ప్రచారమంటూ చెప్పుకొచ్చారు. ఇలా వివిధ సందర్భాల్లో చంద్రబాబును, టీడీపీని, లోకేష్‌ను వీడియోలు పెట్టి విమర్శలు చేసిన పాత వీడియోలను నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగా పదవులు ఇస్తున్నారూ అంటూ ప్రశ్నిస్తున్నారు.