Vijayawada Latest News : విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి వస్తున్న కాలుష్యం అంశం అసెంబ్లీ చర్చకు వచ్చింది. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి జవాబు ఇచ్చారు. ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు.
NTTPS కాలుష్యం, స్థానిక ప్రజల జీవనోపాధిపై మంత్రి గొట్టిపాటి రవి క్లారిటీ ఇచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాండ్ యాష్ తరలించే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. " NTTPS నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు NTTPSలో మరమ్మతులు చేపడుతున్నాం. పాండ్ యాష్ అక్రమ నిల్వ చేసి, తరలిస్తున్న కారణంగా స్థానికంగా కాలుష్యం జరిగేది. PCB సూచనల ప్రకారం బూడిద తరలింపునకు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించింది. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కోల్ స్టోరేజ్ షెడ్ నిర్మిస్తున్నాం." అని వివరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలతో స్థానికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. " కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేర కాలుష్య నివారణకు రూ.50 కోట్లు ఖర్చు చేశాం. NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణలో భాగంగా కొత్త పరికరాలను అమర్చడం కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టెండరింగ్ ఎజెన్సీ ద్వారా స్థానికుల జీవనోపాధి దెబ్బతింటుందనేది అసత్య ప్రచారం మాత్రమే. NTTPS చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది . స్థానిక ప్రజల త్యాగాలను విద్యుత్ శాఖ, జెన్కో ఎప్పటికీ మర్చిపోదు. బూడిద తరలింపుకు స్థానిక ప్రజల ట్రక్కులనే జెన్కో ఉపయోగిస్తుంది. బూడిద తరలింపు కోసం లోడింగ్ ఉచితంగా చేయడంతో పాటు రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది ." అని సభలో పేర్కొన్నారు.
మాటలతో సరిపెట్టడం కాదని లోకల్‌గా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు మంత్రి సభకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. "బూడిద తరలింపు టెండర్‌పై స్థానికులు ఆందోళన చెందాల్సినవసరం లేదు. స్థానికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకునే టెండర్ అమలు చేస్తున్నాం. స్థానికుల ప్రజల ఆరోగ్య సమస్యపై కూడా విద్యుత్ శాఖ దృష్టి సారించింది . విద్యుత్ ఉద్యోగులతో సమానంగా మెడికల్ ప్యాకేజ్ అమలు చేస్తున్నాం. ఏపీ జెన్కో మొబైల్ మెడికల్ యూనిట్లతో పరిసర గ్రామాల్లో ప్రతీ గడపను చేరుకుంటుంది. స్థానిక గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. చుట్టు పక్కల గ్రామాల ప్రజల ఆరోగ్య రికార్డులను భద్రపరిచి స్పెషలిస్టు డాక్టర్లతో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మొబైల్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానికంగా ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తున్నాం. అని మంత్రి తెలిపారు.