New Liquor Policy In Andhra Pradesh: ఏపీలో త్వరలోనే కొత్త మద్యం పాలసీ తెరపైకి రానుంది. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిందని డిజిటల్ పిమెంట్స్ కు అనుమతి ఇవ్వకుండా కేవలం డైరెక్ట్ క్యాష్‌ తీసుకుంటూ  కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు అని కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. సొంత మద్యం బ్రాండ్లతో అటు ప్రజల ఆరోగ్యం ఇటు ప్రభుత్వ ఖజానా రెండింటికీ దెబ్బకొట్టారు అని ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశారు. నిజానికి నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కాస్త ముందుగా మాత్రమే మద్యం దుకాణాల్లో డిజిటల్ పెమెంట్ లకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ నాటి పాలనపై అనుమానాలు సృష్టించింది అనేది స్పష్టం.


కొత్త మద్యం పాలసీని రెడీ చేస్తున్న కూటమి ప్రభుత్వం


ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన వైట్ పేపర్స్ లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఏకంగా అసెంబ్లీలోనే శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసిన చంద్రబాబు గత వైసీపీ పాలనలో మద్యం టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. దేశ వ్యాప్తంగా మద్యం వినియోగం పెరిగిన వేళ పక్క రాష్ట్రాల్లో ఆదాయం పెరిగితే ఏపీలో మాత్రం తగ్గింది అన్నారు. అప్పటి పాలకులు ఏపీ ఖజానాకు రావల్సిన ఆదాయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం వల్లే ఈ పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.



అక్టోబర్ 1 నుంచి క్రొత్త మద్యం పాలసీ 


ప్రస్తుతం ఏపీలో మద్యం పాలసీ ఎలా ఉండాలి అనేదానిపై అధ్యయనం చేయడానికి మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. ఆ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, గొట్టిపాటి రవి, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వీరు పక్క రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్న మద్యం పాలసీలను పరిశీలించి దానికి అనుగుణంగా కొత్త పాలసీకి తగిన సూచనలను ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారు. అనంతరం అక్టోబర్ 1 న ఏపీలో కొత్త మద్యం పాలసీని సీఎం ప్రకటిస్తారు.


Also Read:నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?


మరి మా సంగతి ఏమిటి - మద్యం షాపుల ఉద్యోగులు


కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి ప్రైవేటుపరం చేస్తారు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దానితో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కారు. ముందు తమ ఉద్యోగాల సంగతి తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేశారని  కానీ ఐదేళ్లుగా  పని చేస్తున్న తమకు సరైన సమయానికి జీతాలు ఇవ్వలేదని వారు అంటున్నారు. పైగా తమకు రావల్సిన PF,OT,ESIల డబ్బును కూడా ఏజెన్సీలు తినేసాయని ఆరోపిస్తున్నారు.  కొత్త ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇలా అర్దాంతరంగా తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. అందుకే కొత్త మద్యం పాలసీ ప్రకటించేలోపు తమ ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కోణంలోనే సెప్టెంబర్ 4 నుంచి నిరసనలు చేస్తామని సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ చేపడతామని ఏపీ బేవెరేజేస్ కాంట్రాక్ట్ అండ్‌ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 18వేల మంది వరకూ పనిచేస్తున్నారు. అన్నివేల కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయకండి అంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్