Andhra Pradesh YSRCP Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్‌ల సీజన్ నడుస్తోంది. నిన్నామొన్నటి వరకూ తిరుగులేని పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నుంచి రోజుకు ఇద్దరు ముఖ్యనేతలు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పని చేశారు.  తర్వాత ఎవరు అన్నదానిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. లండన్ లో ఉంటున్న కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తానని ఆయన కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించి లండన్ కు  బయలుదేరుతారు. మళ్లీ నెలాఖరులో వస్తారు. ఇప్పుడు వలసలు పెరుగుతున్న  సమయంలో జగన్ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహం ఆ పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది. 


రాజ్యసభ సభ్యుల్లో ఎంత మంది ఉంటారో ?


ఏపీకి రాజ్యసభలో మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఆ పదకొండు మంది వైసీపీకి  చెందినవారే. టీడీపీకి ఒక్కరు కూడా లేరు. అయితే ఆ పదకొండు మందిలో గురువారం ఇద్దరు రాజీనామా చేశారు. వారి స్థానాలు ఖాళీ అయినట్లుగా గెజిట్ కూడా విడుదల అయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ రెండు స్థానాలు కూటమి ఖాతాలో పడిపోతాయి. ఇంకా వైసీపీకి మిగిలిన తొమ్మిది  మంది ఎంపీల్లో ఎంత మంది ఉంటారో ఎంత మంది ఉండరో అర్థం కాని పరిస్థితి . కొంత మంది  మీడియా ముందుకు వచ్చి .. తాము వైసీపీని వీడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా చెప్పారంటే... ఏదో గూడు పుఠాణి ఉందని అనుకునే పరిస్థితి. 


విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్


మండలిలో ఆధిపత్యం పోతుందా ?


ఏపీ శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. మొత్తం 58 మంది సభ్యుల్లో 36 మంది ఆ పార్టీకి చెందిన వారు అధికారికంగా ఉన్నారు. కానీ రాజీనామాలు.. అనర్హతలతో ఇప్పటికీ ఆ సంఖ్య 28కి తగ్గిపోయింది. రెండు రోజుల్లో ముగ్గురు రాజీనామా చేశారు. అలాగే పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయలేదు కానీ.. టీడీపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. గతంలో వైసీపీ ఆదేశాలు పట్టించుకోకుండా సభకు హాజరు కావడం.. వైసీపీ సమావేశాలకు వెళ్లక పోవడం వంటి వాటి ద్వారా తాము ఎవరి వైపో చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ  ఆధిక్యతను తగ్గించడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. జగన్ దేశంలో లేని సమయంలో ఇది  మరంత ఉద్ధృతంగా సాగుతుందిని భావిస్తున్నారు. దీనికి విరుగుడుగా వైసీపీ వద్ద ఏదైనా వ్యూహం ఏదైనా  ఉందా అని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు. 


సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి - ఆయనను పక్కన పెడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందా ?


మహారాష్ట్ర ఫార్ములాను ప్రయోగిస్తే మొదటికే మోసం


మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపలకు చెందిన మెజార్టీ ప్రజా ప్రతినిధులు చీలిపోయి.. తమదే అసలైన పార్టీ అని  ప్రకటించుకున్నారు. ఈసీ కూడా వారికే గుర్తింపు ఇచ్చింది. కోర్టుల్లో కూడా అదే తీర్పు వచ్చింది. ఇప్పుడు వైసీపీలోకిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా మెజార్టీ వీడిపోయి తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకుంటే రాజకీయం ఎలా మారుతుందన్న ఓ గుసగుస  ఏపీలో గట్టిగానే వినిపిస్తోంది. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి రాజకీయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లో విశ్వాసపాత్రులు అనే వారు ఎవరూ ఉండరు. అవకాశాలను బట్టే ఎవరి వ్యవహరశైలి అయినా ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రమాదం ఉంటుందని అంచనా వేసి జగన్ .. ఓ ప్లీనరీలో.. తనను  శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. కానీ అది చెల్లదని ఈసీ ప్రకటించింది. బహుశా  ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అప్పుడే ఊహించారేమోనన్న సందేహం రాజకీయవర్గాలకు వస్తోంది. 


కారణం ఏదైనా రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు. పాత కేసుల విచారణ.. ముంచుకొచ్చే కొత్త కేసులు.. రాజకీయపరమైన సవాళ్లతో ఆయన ఉక్కిరిబిక్కిరి కాబోతున్నారు.