భార్యాభర్తలు అన్నాక చిన్నపాటి గొడవలు, అలకలు, బెట్టుగా ఉండడాలు సాధారణమే. అసలు అలాంటివి లేని సంసార జీవితం బోరింగ్ గా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. ఆ అలకలు, గొడవలు చిన్న చిన్నవే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. అందుకే మొగుడుపెళ్లాల బంధం చాలా సున్నితమైనదిగా పెద్దలు అభివర్ణిస్తుంటారు. దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానంగా ఉంటున్నప్పుడు గొడవలు, అలకలు, బెట్లు ఎదురైనప్పుడు సందర్భాన్ని బట్టి ఎవరో ఒకరు తగ్గాలి. అలా చేస్తే వారి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమర్థంగా తట్టుకోగలరని పెద్దలు చెబుతుంటారు.
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త బుగ్గ కొరికేశాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కానూరు కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతను మద్యానికి బానిసయ్యాడు. మందు తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భార్య ఫిర్యాదులో వివరించింది. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి భార్యతో వివాదానికి దిగాడు. భార్య మందలించడంతో ఆగ్రహం చెందిన ఇతను ఆమెపై దాడి చేసి బుగ్గ కొరికేశాడు. చికిత్స పొందిన అనంతరం ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తలాక్ పై ఏపీ హైకోర్టు తీర్పు
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన భార్యాభర్తల విడాకుల విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నోటి మాట తలాక్ చెల్లనప్పుడు లిఖితపూర్వక తలాక్ చెప్పడం చెల్లదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నోటిమాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్ నామా రాసుకున్నా వివాహం రద్దు కాదని ధర్మాసనం వెల్లడించింది. ఇస్లాం ప్రకారం భార్యాభర్తలు విడాకులు పొందాలంటే వారి మధ్య ఏకాభిప్రాయం కోసం మధ్యవర్తులు ప్రయత్నించాలని తెలిపింది.
ఒకవేళ రాజీ ప్రయత్నం విఫలమైతే తగిన వ్యవధి తర్వాత తలాక్ చెప్పవచ్చనని స్పష్టం చేసింది. భర్త, తాను వేర్వేరుగా ఉంటున్నందున తన జీవనభృతికి ఉత్తర్వులు ఇవ్వాలని 2004లో పి గౌస్‌బీ పొన్నూరు కోర్టులో కేసు వేశారు. ఈ వాదనను భర్త జాన్ సైదా వ్యతిరేకించారు. తలాక్ చెప్పి రిజిస్టర్ పోస్టులో పంపినట్లు తెలిపారు. ఈ విడాకులు చెల్లవని, భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నందున ఆమె భరణం పొందేందుకు అర్హురాలని పేర్కొంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ సమర్థించారు.
Also Read: IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్