JNTU Employee Selfie Video: ‘‘ఈ రెడ్డి రాజ్యంలో పని చేయలేం బాబోయ్’’ అంటూ స్వచ్ఛంద పదవీ విరమణకు (Voluntary Retirement) కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధపడుతున్నారు. తాజాగా అనంతపురం జేఎన్టీయూ (JNTU Anantapur) కళాశాలలో సూపరిండెంట్ గా పని చేస్తున్న ఎండీ నాగభూషణం వీడియో ద్వారా తన బాధను వెళ్లగక్కారు. ఉద్యోగ ఉన్నతి (Promotion) తో ఏ ఉద్యోగికైనా బదిలీలు ఉంటాయి. కానీ పదోన్నతి లేకుండా నిష్కారణంగా తనను అనంతపురం నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలికిరి జేఎన్టీయూకి (JNTU Kalikiri) బదిలీ చేశారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన భార్య ఉద్యోగం చేస్తోందని, స్పౌస్ కేస్ (Spouse Case Transfer) కింద కూడా తన ట్రాన్స్‌ఫర్ ను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 


మరోవైపు వయసు మీద పడి ఆరోగ్యాలు సరిగా లేని తల్లిదండ్రులను వదిలి అంత దూరం వెళ్లడానికి ఎంతో ప్రయాస పడుతున్నట్లు బాధను వ్యక్తం చేశారు. తన ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందించలేదని, కమిటీల పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలబడతామని ప్రగల్బాలకు పోతున్న ఈ ప్రభుత్వ హయాంలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి పట్టం కడుతున్నారని ఆరోపించారు. 


యూనివర్సిటీ వ్యవస్థల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు కీలక పోస్టుల్లో ఉంటూ బడుగులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా తనలా మరెవరు మానసిక క్షోభకు గురికాకుండా ఉండాలని స్వచ్ఛంద పదవీ విరమణ చేసి (Voluntary Retirement) బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని వీడియో సందేశాన్ని నాగభూషణం పంపించారు. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులలో ఇలాంటి నిస్పృహలు నెలకొని ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ నాగభూషణం మాజీ ఎమ్మెల్యే, పెనుగొండ మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీకి చెందిన శంకర్ నారాయణకు సమీప బంధువు కావడం కొసమెరుపు. ఒకానొక దశలో బదిలీ ఆపేందుకు మాజీ మంత్రి కూడా ప్రయత్నించి విఫలమయ్యారని తెలుస్తోంది.


జీపీఎఫ్ ఖాతా నుంచి వందల కోట్ల డెబిట్
మరోవైపు, గవర్నమెంట్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం జీపీఎఫ్‌ (General Provident Fund) లో దాచుకున్న సొమ్ములకు కస్టోడియన్ గా ఉన్న ఏపీ ప్రభుత్వమే, ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఏపీలో దుమారం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ పై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్ డ్రా చేసిందని వెల్లడించింది. 2021-22లో రూ.413.73 కోట్లు విత్ డ్రా చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది. 


ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముపై టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో ప్రశ్నించారు. నాని అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల ఉపసంహరణ అంశం ఏపీ హైకోర్టులో విచారణకు రావడం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్లే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా చేయడం జరిగిందని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ అప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించారు. బడ్జెట్ మంజూరు అయితే, ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము తిరిగి క్రెడిట్ చేస్తామని చెప్పారు. అయితే, వేర్వేరు కారణాలు వివరించేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్‌కు కూడా అర్థం కావని హైకోర్టు పేర్కొంది.