Kodi Katthi Case: విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై సోమవారం రోజు విజయవాడ ఎన్ఐఏ కోర్డులో విచారణ జరగనుంది. ఈ కేసులో సాక్షి, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మేజిస్ట్రేట్ పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ న్యాయస్థానాన్ని కోరారు. విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి సోమవారం జరిగే విచారణకు తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
దాడి జరిగిన నాలుగేళ్లు.. ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసిన చాలా కాలం తర్వాత విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును పోలీసులు కోర్టుకు తీసుకు వచ్చారు. కేసు వాయిదా పడిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. బాధితుడు జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కావాలని గతంలోనే ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఢిల్లీలో పెట్టుబడుల సన్నాహక సమావేశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు.
కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?
2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్..సెల్ఫీ తీసుకుంటానని అంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది.
2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు మీద తమకు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది. విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాస రావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించ కూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.