విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) బీజేపీలో చేరతారని విపరీతమైన ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఆయన కార్యాలయం కేశినేని భవన్‌లో చంద్రబాబుతో ఉన్న ఫోటోలు తొలగించి ఇతర ఫోటోలు పెట్టడంతో పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేశినేని భవన్‌‌లోని చంద్రబాబు ఫొటోతో పాటు, పార్టీ నాయకుల ఫొటోలన్నీ తొలగించారని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కేశినేని నాని సన్నిహితుడు, టీడీపీ నేత ఫతావుల్లా ఖండించారు. సోమవారం కేశినేని భవన్‌లో ఫతావుల్లా విలేకరులతో మాట్లాడారు. 

Continues below advertisement


కేశినేని భవన్‌లో ఒక చోట మాత్రమే రతన్‌టాటాతో నాని ఉన్న చిత్రపటాన్ని పెట్టారని చెప్పుకొచ్చారు. టాటా ట్రస్ట్‌ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రతన్‌ టాటా విస్తృతంగా సేవలందించారని గుర్తు చేశారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ సేవల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో కేశినేని నాని రతన్ టాటాతో ఉన్న ఆ చిత్ర పటాన్ని కార్యాలయంలో ఉంచారని వివరించారు. అంతే తప్ప పార్టీ మారే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. పార్టీ మారతారనే దుష్ర్పచారం చేస్తున్న వారికి కేశినేని భవన్‌ బయట ఉన్న 40 అడుగుల ఎత్తైన చంద్రబాబు, ఎన్టీఆర్‌ చిత్రాలు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. 


Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?


విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్‌ఛార్జులుగా ఉన్న నాయకుల ఫొటోలు కూడా కేశినేని భవన్‌లో తొలగించారని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని అన్నారు. బీజేపీ మునిగిపోయే పడవ అంటూ అభివర్ణించారు. ఆ పార్టీతో కేశినేని నాని ఎలాంటి చర్చలు జరపడం లేదు.. జరపబోరు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమనే ఉద్దేశంతోనే ఎంపీ నానీ పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా దూరంగా లేరు. ఇటీవల తిరువూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. 2024లో సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారని వెల్లడించారు.


Also Read: సీఎం జగన్ కీలక నిర్ణయం... కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశాలు


Also Read:   కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... విద్యుత్ కొరత రాకుండా అత్యవసర ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి