ఇప్పటం అభివృద్ధికి మాత్రమే జనసేన అధినేత పవన్ 50లక్షలు ప్రకటించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని కొందరు మూర్ఖులు లేఖలు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తే ఖజానాలో జమ చేయాలని ప్రభుత్వ అదికారుల ఎలా అడుగుతారని ప్రశ్నించారాయన.
సభకు స్థలం ఇచ్చినందుకు రూ. 50లక్షలు
జనసేన పార్టీ ఆవిర్బావ సభను నిర్వహించుకునేందుకు ఇప్పటం గ్రామస్థులు 14ఎకరాల స్దలాన్ని సమకూర్చారు. విజయవాడ గుంటూరుతోపాటుగా వివిధ ప్రాంతాల్లో ఈ సభ నిర్వహించుకునేందుకు స్థలాన్ని చూశారు. కానీ ఎక్కడా స్థలం లభించలేదు. కొన్ని చోట్ల స్థానికులు స్థలం ఇచ్చేందుకు అంగీకరించినా... అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు బెదిరింపులతో వెనక్కి తగ్గారని జనసేన ఆరోపించింది. దీంతో పవన్ సభ నిర్వాహణకు జనసేన నేతలు నానా తంటాలుపడ్డారు. ఇదే సమయంలో ఇప్పటం గ్రామస్థలు సభ కోసం 14ఎకరాల స్దలాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇప్పటంలో పవన్ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభ అయిన తరువాత నుంచి ఇప్పటం గ్రామం నిత్యం వార్తలో నిలిచింది. పవన్ కూడా గ్రామస్థుల ధైర్యానికి మెచ్చుకొని, గ్రామ అభివృద్ధికి 50లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచే రాజకీయం మరింత ముదిరింది.
ఇప్పటంలో ఆక్రమణల తొలగింపు...
పవన్ సభ నిర్వహించిన నాటి నుంచి అధికార పార్టీ నేతలు ఇప్పటం గ్రామంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామంలోని రోడ్డును 120అడుగులకు విస్తరించే ప్రతిపాదనలను తెర మీదకు తెచ్చి, ఇళ్ళ నిర్మాణాలను నష్టపరిహరం ఇవ్వకుండా తొలగించారని అంటున్నారు. ఈ వ్యవహారంపై జనసేనాని కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళ నిర్మాణాలను తొలగించిన 24గంటల్లోనే గ్రామాన్ని పవన్ సందర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతే కాదు ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థిక సహయాన్ని ప్రకటించారు. మొత్తం 53 ఇళ్ళకు నష్టం వాటిల్లిందని గుర్తించి, బాదితులకు 53లక్షల సహయాన్ని అందించారు.
ముందు ప్రకటించిన 50లక్షలు ఇవ్వాలన్న సర్కార్..
పవన్ కళ్యాణ్ సభ విజయవంతమైన తరువాత గ్రామం అభివృద్ధికి ప్రకటించిన 50లక్షల రూపాయల విరాళాన్ని ఖజానాకు జమ చేయాలని అధికారులు జనసేన పార్టీ కార్యాలయానికి లేఖలు రాశారు. ఈ వ్యవహరంపై పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ ప్రకటించిన విరాళం గ్రామం అభివృద్ధికి తప్ప, ప్రభుత్వ ఖజానాకు కాదని స్పష్టం చేశారు. జగన్‌కు నిధులు ఇస్తామని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం కూల్చటానికి తప్ప, కట్టడానికి పనికి రావటం లేదని ఆయన మండిపడ్డారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని ఆయన అన్నారు.
పవన్ ప్రకటించిన నిధులను గురించి అదికార పార్టీకి చెందిన నేతలు ప్రశ్నించటం, అధికారులతో లేఖలు రాయించటం సిగ్గు చేటని విమర్శించారు నాదెండ్ల. పవన్ నిధులు ఇస్తే వాటిని కూడా జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయలేని వైసీపీ, జనానికి తోడుగా ఉన్న జనసేనపై కక్ష సాధింపులకు పాల్పడటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.