మచిలీపట్టణంలో సంచలనం రేకెత్తించిన మహిళా వైద్యురాలి హత్య కేసులో పోలీసుల నిందితులను అరెస్ట్ చేశారు. డాక్టర్‌గా పని చేస్తున్న భర్తే, ఇంట్లో పని చేసే కార్ డ్రైవర్‌తో కలసి హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారించారు.


మహిళా వైద్యురాలి దారుణ హత్య
మచిలీపట్టణంలో ఇటీవల డాక్టర్ రాధ తాను ఉంటున్న ఇంటిలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. భార్య భర్తలు ఇద్దరు వైద్యులే కావటంతో ఇంటిలోనే క్లీనిక్ నిర్వహిస్తున్నారు. భర్త ఇంటి కింద క్లినిక్ లో పని చేస్తుండగానే, పై అంతస్తులో నివాసం ఉంటున్న భార్య హత్యకు గురి కావటంతో కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో కట్టుకున్న భర్తే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ఆధారాలను సేకరించారు.


డాక్టర్ అయిన భర్త.. కార్ డ్రైవర్ తో కలసి...
హత్యకు గురయిన డాక్టర్ రాధ, భర్త ఉమామహేశ్వరరావు ఇద్దరు వైద్య రంగంలో స్దిరపడ్డారు. అయితే వీరి ఇరువురి మధ్య కొంత కాలంగా ఆస్తికి సంబంధించిన విభేదాలు కొనసాగుతున్నాయి. పలు దఫాలుగా ఇద్దరు గొడవలు కూడా పడ్డారు. 
రాధ తన భర్త పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా కేకలు వేసేవారని, చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు పోలీసులకు చెప్పారు. అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయటంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. 


మూడు నెలల క్రితమే స్కెచ్...
వైద్యురాలు అయిన తన భార్య రాధను హత్య చేసేందుకు వైద్యడు ఉమామహేశ్వరరావు మూడు నెలల క్రితమే స్కెచ్ వేశాడని పోలీసులు నిర్దారించారు. గతంలో రెండు సార్లు హత్యకు ప్రయత్నాలు చేసినప్పటికి, ప్లాన్ వర్కవుట్ అవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. హస్పిటల్ లో ఆక్సిజన్ సిలిండర్ కోసం ఉపయోగించే పెద్ద ఇనుప రెంచ్‌తో రాధ తలపై భర్త డాక్టర్ మహేశ్వర రావు దారుణంగా దాడి చేశాడు. ఈ దాడితో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో పడి గిలగిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. 


ఆ సమయంలో ఆమె గట్టిగా అరవకుండా ఉండేందుకు ఆమె నోటి భాగాన్ని గట్టిగా నొక్కి పట్టడానికి డ్రైవర్ మధు సహకరించాడని విచారణలో తేలింది. హత్య తరవాత స్థానిక సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కారంపొడిని డ్రైవర్ మధు శవం మీద చల్లాడని పోలీసులు ముందు అంగీకరించాడు.


డ్రైవర్ కు బంపర్ ఆఫర్..
డాక్టర్ రాధను హత్య చేసేందుకు సహకరించాల్సిందిగా డ్రైవర్ మధుకు వైద్యుడు ఉమామహేశ్వరారావు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. హత్యను అనుకున్నట్లుగా పూర్తి చేసి చేతులు దులుపుకుంటే, 35లక్షల రూపాయలు నగదు, మరి కొంత బంగారం, ఇచ్చి లైఫ్‌ను సెటిల్ చేసేందుకు ఓకే చెప్పాడు. హత్య తరువాత ఎవరికి అనుమానం రాకుండా వైద్యుడు ఉమామహేశ్వరరావు కిందకు వచ్చి తన క్లీనిక్‌లో పేషెంట్‌లకు వైద్యం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు.