Kodikatthi Case : కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు (Janupalli Srinivasa Rao) బెయిల్‌ పిటిషన్‌ పై ఏపీ (Ap) హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ (Jagan)పై హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లుగా శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ...నిందితు తరపున న్యాయవాది జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే శ్రీనివాసరావుకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడి తరపున లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని, ఈ కారణంగా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి...ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని వివరించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం...తీర్పును రిజర్వ్‌ చేసింది.


ఐదేళ్లుగా జైల్లోనే కోడి కత్తి శ్రీనివాసరావు
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేస్తున్నారు. బాధితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్‌కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ  సీఎం జగన్ స్పందించలేదు.  దీంతో శ్రీనివాస్ నేటికి కూడా రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన  కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.  కేసులో లోతైన విచారణ జరపాలిని బాధితుడు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.  గతంలో ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్‌ఐఏ కోర్టు  ఉత్తర్వులను హైకోర్టులో జగన్  సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. శీను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లకు మోక్షం కలగడం లేదు. గతంలో శీను తల్లి సీజేఐకి.. రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. 


వీఐపీ లాంజ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై దాడి
2018లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దాంతో మధ్యాహ్నంలోపు పాదయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్...విఐపీ లాంజ్ లోకి వెళ్లారు. వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో...అక్కడి క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీను  కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు.