Mla Gorantla Comments : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ (Rajamundry Rural) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchhaiah Chowdary ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే తమను అడుగుతున్నారని అన్నారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే... గెలిపిస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారని వెల్లడించారు. దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు.
50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు!
అధికార పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు... తమకు టచ్ లోకి వచ్చారని, రాజ్యసభ ఎన్నికలపై సంప్రదింపులు జరుపుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే...ఇప్పుడు ఆమోదించాల్సిన అవసరం ఏముందన్నారు. గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో మూడేళ్ల పాటు స్పీకర్, సీఎం గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామనే...రాజీనామాను ఆమోదించారని అన్నారు. రాష్ట్రం బాగుండాలనే వైసీపీ చెందిన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
సామాజిక న్యాయం ఎక్కడుంది ?
జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహం పేరుతో దోపిడీకి పాల్పడ్డారన్న ఆయన... కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందన్నారు. జగన్ వ్యవస్థల మేనేజ్మెంట్ పతాక స్థాయికి చేరిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, న్యాయమూర్తి ఇంటికి రెండు కోట్ల రూపాయల విలువైన వజ్రాల వాచీ పంపాడని ఆరోపించారు. ఏళ్లుగా బెయిల్ మీద ఉంటూ, తనపై కోర్టులో ఉన్న కేసుల విచారణ ముందుకు సాగకుండా రాజ్యాంగ వ్యవస్థల మేనేజ్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. అందు కోసం ఎన్ని వజ్రాల వాచీలు, ఎన్ని వేల కోట్లు వెచ్చించాడో అంటూ విమర్శించారు. ఈ పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికి రారన్న ఆయన...రాష్ట్ర ప్రగతికి శాపం జగన్ మోహన్ రెడ్డేనన్నారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
ఫిబ్రవరి నెలాఖరులో ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రాజ్యసభ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. వైసీపీకి పూర్తి బలం ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ అధినేత జగన్... ఎక్కడో తేడా కొడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వారంతా... వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా... ఎంపీ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి...ఈ సారి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.