ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసులు రెడీ అవుతున్నారు. ఇందులో మొదటి వరుసలో నిలిచారు మచిలీపట్టణం శాసనసభ్యుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు.


నాని స్టైలే వేరు


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేర్ని నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి దఫాలోనే  మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత నుంచి పేర్ని నాని పేరు మారుమోగిపోయింది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో ఆయనతో ప్రత్యేక స్టైల్. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసే ఆరోపణలకు వైసీపీ నుంచి మొదట కౌంటర్ ఇచ్చేది ఈయన. 


ఇలా ప్రతిపక్షాలపై ఒంటికాలిపై లేచే నానికి జగన్ వద్ద మంచి పేరు వచ్చింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నానితోపాటుగా పేర్ని నాని ద్వయం నడిచింది. మంత్రివర్గంలో స్థానం పోయినప్పటికీ విపక్షాలపై విమర్శ ఘాటు మాత్రం తగ్గించలేదు పేర్ని నాని. సీరియస్ ఇష్యూలో కూడా కాస్త వ్యంగ్యం జోడించి ఆయన చేసే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 


ఓకే చెప్పినట్టేనా


మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన తర్వాత తర్వాత ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. తన వారసుడికి టికెట్ ఇవ్వాలని జగన్ వద్ద ప్రస్తావించారు. మొదట్లో వారసుల ఎంట్రీకి నో చెప్పిన జగన్ తర్వాత ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


వారసుల ఎంట్రీపై వైసీపీ అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్‌ ఇవ్వకపోయినా నేతల మాత్రం తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. ఆ వరుసలో పేర్ని నాని ముందు ఉన్నారు. వారసుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేలా ఆయన మొన్న ఓ ప్రకటన చేశారు. సీఎం జగన్ సాక్షిగా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లుగా జనాలకు చెప్పేశారు. జగన్‌తో మరో సభలో పాల్గొంటానో లేదో కూడా తెలియదని కామెంట్ చేశారు. 


వారసుడి ఎంట్రీ...
పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా ఇప్పటికే రాజకీయాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారని అంటున్నారు. రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలనే దాని పై కుమారుడికి తండ్రి పేర్ని నాని ఓనమాలు కూడా దిద్దించటంతో పాటుగా, దూకుడుగా వెళ్లేందుకు అవసరమైన సలహాలు అందిచారట. ఇప్పటికే పేర్ని నాని పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలు, సమావేశాలకు కూడా కుమారుడిని పంపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించిన సమయంలో కూడా పేర్ని నాని బయటే ఉండి తన కుమారుడిని లోపలికి పంపటం చర్చనీయాశంగా మారింది. అప్పుడే మీ నాన్న నీకు అన్ని బాద్యతలను అప్పగించేస్తున్నారా అంటూ పార్టీ నేతలు సైతం పేర్ని కిట్టుతో నవ్వుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారసుడికి బాద్యతలు అప్పగించిన మాజీ మంత్రిగా కూడా పేర్ని నానికి పేరు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్ని నాని పని చేశారు. అప్పుడు వైఎస్ఆర్‌తో ఆ తరువాత ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హాయాంలో నాని కీలకంగా వ్యవహరించారు. బందరు పోర్ట్ వ్యవహరం రాజకీయ దుమారాన్ని రాజేయటం, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో పేర్ని నాని వార్తల్లో నిలిచారు.