గన్నవరానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత యార్లగడ్డ వెంకట్ రావు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. నేడు (ఆగస్టు 20) ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. టీడీపీలో చేరడానికి తాను ఇష్టంగానే ఉన్నానని, త్వరలోనే చేరతానని చంద్రబాబుకు చెప్పినట్లుగా యార్లగడ్డ వెంకట్రావు వివరించారు. భేటీ తర్వాత ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూడా కలిసి పని చేద్దామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారని అన్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజా ప్రతినిధిగా ఉండాలని భావించి గతంలో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేశారు.


కానీ, తన ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్ సీపీకి మద్దతు పలికారని, దాంతో వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం తనను పూర్తిగా పక్కకు పెట్టేసిందని ఆవేదన చెందారు. గత మూడున్నర సంవత్సరాల నుంచి అధిష్ఠానం తనను, తన అనుచరులను పట్టించుకోవడం మానేసిందని వివరించారు. 


గన్నవరం నుంచి పోటీ చేస్తారా అనే విషయం ప్రశ్నించగా, చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమే అని అన్నారు. గన్నవరం, విజయవాడ లేదా గుడివాడ నుంచి కూడా పోటీ చేయడానికి తాను రెడీ అని అన్నారు. 


వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లుగా నిన్న ప్రకటన


శనివారం (ఆగస్టు 19) విజయవాడలో యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లుగా ప్రకటన చేశారు. టీడీపీలోకి వెళ్తున్నట్లుగా కూడా ప్రకటించేశారు. తనను సజ్జల రామక్రిష్ణారెడ్డి పట్టించుకొని ఉండే బాగుండేదని, గతంలో పార్టీ కోసం పనిచేశాడనే గుర్తింపు ఇచ్చినా బాగుండేదని అన్నారు. పార్టీ కోసం తాను చాలా కష్టపడినప్పటికీ, ఉంటే ఉండు లేదంటే వెళ్లు అనే మాట తనను బాధించిందని అన్నారు. తనకు జరిగినన్ని అవమానాలు రాజకీయాల్లో ఎవరికీ జరగలేదని అన్నారు.