Mandali Buddha Prasad: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అనుచరులతో కలిసి దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మండిపడ్డారు. వివరణ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. తాను ప్రజాప్రతినిధిని అనే విషయం మరచి, తన క్రిమినల్‌ మైండ్‌ని ఉపయోగించి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. పక్కా పథకం మేరకు దాడి జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వెళ్లిపొమ్మని చెప్పి వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డారని బుద్దప్రసాద్ ఆరోపించారు. 


ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పే సింహాద్రి రమేష్‌బాబు.. శుక్రవారం కూడా ఒంటరిగా తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోయారా? అని నిలదీశారు. సింహాద్రి రమేష్‌బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులకు ఉందన్నారు. సింహాద్రి రమేష్ ఇలా దాడులు చేయడం కొత్త ఏం కాదని అన్నారు. గతంలో బ్యాంకు లోన్‌ కట్టమని అడిగినందుకు మేనేజర్‌ని బ్యాంకు నుంచి బయటకు లాగి కొట్టిన విషయం అందరికీ తెలుసునన్నారు. అలాగు నాగాయలంకలో నాబార్డ్‌ ఛైర్మన్‌ ఎదుట స్థానిక ఎంపీ ప్రధాన అనుచరుడిని కొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


నిరసన తెలిపే హక్కు దేశంలో ప్ర తిపౌరుడికి ఉందని బుద్ధ ప్రసాద్ అన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ నేతలు ఎన్ని నిరసనలు చేపట్టారో తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలను భయపెట్టేలా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రవర్తిస్తున్నారని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అవనిగడ్డలో బంద్‌ జరగనివ్వకుండా వీధుల్లో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని మండిపడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసిన షాపులను బలవంతంగా తెరిపించడం పోలీసులకు తగదని హితవుపలికారు. నేరస్థులపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాలపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అధికార పార్టీ నేతల సేవలో పోలీసులు తరిస్తున్నారని బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నా చక్కదిద్ధడంలో పోలీసులు విఫమయ్యారని అన్నారు. అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావు హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేరస్థులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజలను వేధించిన పాలకులు ఎక్కువ రోజులు పాలించినట్లు చరిత్రలో లేదన్నారు. 


ఏం జరిగిందంటే?
కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటిని టీడీపీ, జనసేన నాయకులు ముట్టడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆందోళనకు దిగారు. తన ఇంటిని ముట్టడించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కర్ర తీసుకుని  జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.  ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.