CM Jagan At Police Martyrs: పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసుల అమరవీరుల  సంస్మరణ సభలో పాల్గొన్నారు. విధి నిర్వహరణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే యోధుడు పోలీస్‌  అంటూ కొనియాడారు ముఖ్యమంత్రి. ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనిరతి అని.. ఆ డ్రెస్‌పై ఉన్న మూడు సింహాలు మనదేశ సార్వభౌమ అధికారానికి చిహ్నమని అన్నారు. పోలీస్‌  అంటే అధికారం మాత్రమే కాదు.. ఒక బాధ్యత.. ఒక సవాల్‌ అన్నారు సీఎం జగన్‌. పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. 


మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. పోలీసులు కూడా అప్‌డేట్‌ కావలాన్నారు సీఎం జగన్‌. సైబర్‌ నేరస్తులు చీకటి ప్రపంచం సృష్టించుకుని... దోపిడీలు చేస్తున్న వారిని  ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉందన్నారు. కొత్త టెక్నాలిజీని వినియోగించుకుని నేరస్తులు విసిరే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. కొత్త సవాళ్లకు  సమాధానం చెప్పేందుకు పోలీసులంతా సిద్ధం కావాలన్నారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్న  అసాంఘీక శక్తులను అణచివేయాలన్నారు. అలాంటి దుర్మార్గుల విషయంలో చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలన్నారు ముఖ్యమంత్రి. దుష్టశక్తులకు గుణపాఠం  చెప్పాలని... లేకపోతే సమాజంలో రక్షణ ఉండదన్నారు.


అంగళ్లు, పంగనూరు అల్లర్లను కూడా ప్రస్తావించారు సీఎం జగన్‌. అంగళ్లలో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించిందని అన్నారు. పుంగనూరు ఘటనలో 40 మంది  పోలీస్‌ సిబ్బందికి గాయలు అయ్యాయని... ఓ పోలీస్‌ కన్ను కోల్పోయారని చెప్పారు. అవినీతి, నేరాలు చేసి ఆధారాలతో దొరికిపోయారన్నారు. అయినా.. న్యాయస్థానాలు  అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని న్యాయమూర్తలపైనే ట్రోలింగ్‌ చేస్తున్నారని చెప్పారు సీఎం జగన్‌. స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి దుర్మార్గుల  విషయంలో... ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పనిపెట్టాలన్నారు. 


ఏపీలో పోలీస్‌ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా... గ్రామస్థాయిలో 16వేల మంది మహిళా పోలీసులను గ్రామస్థాయిలో  నియమించామన్నారు. దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌ను తీసుకొచ్చామన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా... మహిళల భద్రతపై దృష్టి పెట్టామన్నారు. కోటి 25లక్షల  మంది మహిళల ఫోన్లలో దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయ్యిందన్నారు. దీని వల్ల వారికి భద్రత కలుగుతుందన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను తీసుకొచ్చింది కూడా తమ ప్రభుత్వమే  అన్నారు. ఇందు కోసం అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు కూడా అడుగులు ముందుకేశామన్నారు. కానీ.. ఇవి కోర్టుల వరకు వెళ్లింది కనుక ముందుకు  కదలడంలేదన్నారు. రాష్ట్రంలో నాలుగు కొత్త ఐఆర్‌ బెటాలియన్లు కూడా తీసుకొచ్చామన్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు 17లక్షలు అందించి  ఆర్థిక సాయం చేశామన్నారు. హోంగార్డుల జీతాలను 12వేల నుంచి.. 21వేలకు పెంచామన్నారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ఇచ్చే రిజర్వేషన్లను 15శాతానికి  పెంచామన్నారు. హోంగార్డు, కానిస్టేబుళ్ల స్థాయి నుంచి పోలీసు సిబ్బంది అందరికీ తోడు ఉన్నామన్నారు సీఎం జగన్‌. 


సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అన్నది తమ విధానమని.. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు.. లేవని కూడా పోలీసులు గుర్తిపెట్టుకోవాలన్నారు సీఎం జగన్‌. ముఖ్యంగా... మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత విషయంలో రాజీపడొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.