మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న భారత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండో రోజు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు మంత్రులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను భారత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. మూడురోజుల పర్యటనకు ఏపీ వచ్చిన ఆయన... తొలి రోజు స్వగ్రామ పొన్నవరంలో పర్యటించారు. అక్కడ గ్రామస్థుల చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ చేరుకున్నారు.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
శనివారం ఉదయం ఇంద్రకీలాద్రి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్వాగతం పలికారు. దేవాలయం వద్ద వేద పండితులు, దేవస్థాన మండలి ఛైర్మన్ పైలా సోమి నాయుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితుల ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వెంట ఆంధ్రప్రదేస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం పొన్నవరం వెళ్లిన జస్టిస్ ఎన్వీ రమణకు సొంతూరిలో ఘన సత్కారం లభించింది. అందరూ ఆప్యాయంగా ఆహ్వానించారు. అయన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా పని చేస్తానంటూ ఊరి వాళ్లకు మాట ఇచ్చారు.
శని, ఆదివారం కూడా సీజేఐ జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.