Chandrababu petition in ACB court: 
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రెండు వారాల రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే చంద్రబాబును గృహ నిర్బంధంలో ఉంచేలా చూడాలని ఆయన తరఫు లాయర్లు ప్రయత్నిస్తున్నారు. జ్యుడీషియల్ రిమాండ్ ను గృహ నిర్బంధంలో ఉంచేలా చూడాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దాంతో పాటు వయసురీత్యా తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి భోజనం, మందులు ఇచ్చేలా చూడాలని మరో పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు తరపు లాయర్లు.


చంద్రబాబు వయస్సు, హోదా దృష్ట్యా టీడీపీ అధినేతను గృహ నిర్బంధంలో ఉంచాలని న్యాయవాదులు కోర్టును కోరారు. కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‍ను హౌస్ అరెస్టుగా పరిగణించాలని కోరారు. హౌస్ అరెస్టుకు కోర్టు అంగీకరించని పక్షంలో.. ఒకవేళ రాజమండ్రి జైలుకు తరలిస్తే ఆయనకు ఇంటి భోజనం, స్పెషల్ మెడిసిన్ లాంటి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు.


ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ 
విజయవాడ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సీఐడీ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్ 11న) విచారణ జరిగే అవకాశముంది. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని ఆయన తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో తన వాదనలు వినిపించారు. రెండేళ్ల కిందటే కేసు విచారణ జరిగి నిందితులపై చర్యలు తీసుకోవడం, బెయిల్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఎప్ఐఆర్ లో పేరు చేర్చకున్నా, పోలీసులు సడన్ గా వచ్చి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. 


 ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు. ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. కానీ సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?. కోర్టులో ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు.  సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు’ అని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు విన్నవించారు. 


కానీ సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబుకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనుండగా, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ సైతం పిటిషన్ కు సిద్ధమైంది.