Vijayawada Floods: భారీ వర్షాలకు తోడు బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సగం నీట మునిగింది. నాలుగు రోజుల నుంచి సరైన ఆహారం, నీళ్లతోపాటు నిలువ నీడ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం హ్యాపీ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి(సెప్టెంబర్‌ 5) నుంచి నిత్యవసర సరకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 


నేటి నుంచి నిత్యవసర కిట్‌లు పంపిణీ


విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. గురువారం నుంచి ప్రతి కుటుంబానికి ఓ నిత్యవసర కిట్ పంపిణీ చేస్తామన్నారు. అందులో పాతిక కేజీల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, రెండు కిలోల ఉల్లిపాయలు, లీటర్ పామాయిల్‌ నూనె, రెండు కిలోల బంగాళదుంపలు, ఉంటాయని వివరించారు.
వరద ఉద్ధృతి తగ్గినందున మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ చెప్పొచ్చని సూచించారు. తక్కువ ధరకే కూరగాయలు ఇతర నిత్యవసర వస్తువులు విక్రయించాలని సూచించారు. 


పారిశుద్ధ్య పనులపై ఫోకస్


వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులపై ఫోకస్ చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాల రిపేర్‌ అంశాన్ని అధికారులతో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లు, విచ్చిన్నమై వ్యాపారాల గుర్చి కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్‌, కొత్తవి మంజూరుపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. 


అనాథ శవాలకు గౌరవం


చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఆహారాన్ని తీసుకొస్తున్నారని దీని వల్ల వారు అనారోగ్యం పాలయ్యే ఛాన్స్ ఉందని ఆహారం తీసుకురావద్దని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి కుటుంబాలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. డెడ్‌బాడీలను తీసుకునేందుకు ఎవరూ రాకపోతే గౌరవంగా అంత్యక్రియులు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. 


Also Read: ఈ క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేస్తే చాలు - వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేయొ‌చ్చు


వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు


విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నట్టు సీఎం వెల్లడించారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వరద నీరు లేని ప్రాంతాల్లో బురదను తొలగించే పనులను కూడా ప్రభుత్వం టేకప్‌ చేసింది. దీంతోపాటు శానిటేషన్ పనులు త్వరగా చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ ఫ్యామిలీని భాగస్వాములను చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి సచివాలయంలో ఓ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి రోగులకు కావాల్సిన ప్రతి మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 


ఆఖరి బాధితుడిని ఆదుకునే వరకు తాను ఫీల్డ్‌లోనే ఉంటానని చెప్పారు చంద్రబాబు. అన్ని విధాలా అందరినీ ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బుడమేరు గండ్లు పూడ్చివేసే కార్యక్రమం కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు రెండు బ్రీచ్‌ల పనులు పూర్తైనట్టు వివరించారు. 


Also Read: నేడు మరో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ