AP News:  ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల  జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 32మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24మంది,  గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.


అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయినట్లు ప్రకటించారు. వరదల కారణంగా 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా 6,44,536 మంది నష్టపోయారని తెలిపారు. 193 సహాయ శిబిరాల్లో 42,707 మంది తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని, వరద బాధితుల సహాయార్థం ఆరు హెలికాప్టర్లు పనిచేస్తున్నాయని ప్రకటించారు.  228 బోట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయని తెలిపారు. 317 గజాల ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లు ప్రభుత్వం తెలిపింది.


తగ్గుతున్న వరద 
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది.  ప్రస్తుతం బ్యారేజీకి 4,17,694 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కాల్వలకు 500 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో బ్యారేజీకి 148 టీఎంసీల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపటికి మళ్లీ ప్రకాశం బ్యారేజీకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని, సెప్టెంబర్ 8 నాటికి 3 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గే అవకాశం ఉందని తెలిపారు. 


బెజవాడకు దెబ్బ మీద దెబ్బ
మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణికిపోతుంది. వరద ఉధృతి తగ్గినప్పటికీ విజయవాడ నగరం ఇంకా ముంపు ప్రమాదంలోనే ఉంది. నాలుగు రోజులుగా వరద నీటితో నగర ప్రజలు అల్లాడుతున్నారు. జల దిగ్బంధంలో వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా వరద బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా మందికి ఆహారం, మంచినీరు లభించడం లేదు. వరద బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  ఆహారం, మంచినీరు పెద్ద ఎత్తున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పలు కాలనీల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాల్లో ఇవాళ కూడా పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గనందున రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. వరదల కారణంగా చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు.


మరో అల్ప పీడనం 
 వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుతున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీకి మళ్లీ వర్ష సూచన చేసింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో కోస్తాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 
Also Read: YS Sharmila: తెలంగాణలో హైడ్రాలాగా బుడమేరు ఆక్రమణలు తొలగించాలి - షర్మిల డిమాండ్