క్యాసినో.. ఇప్పుడు ఈ ప‌దం వింటేనే ఏపీ పోలీసులు హ‌డలిపోతున్నారు. విజ‌య‌వాడ శివారు ప్రాంతంలో ఉన్న కంకిపాడులోని ఒక ప్రైవేట్ క‌న్వెన్ష‌న్ లో బుధవారం (జూన్ 22) నిర్వ‌హించిన ప్రైవేట్ పార్టీలో క్యాసినోతో పాటుగా, మందు చిందు, సినిమా న‌టీమ‌ణుల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని ఆహ్వాన ప‌త్రిక‌లు పంపిణి చేశారు. ఇందుకు ఎంట్రీ ఫీజు కింద రూ.20 వేలు కూడా వ‌సూలు చేశార‌నే ప్రచారం జ‌రిగింది. దీంతో ఈ వ్య‌వ‌హ‌రంపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఈవెంట్ మేనేజ్ మెంట్ కూడా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఏర్పాట్లు మెద‌లు పెట్టింది. అయితే ఈ విష‌యంపై పోలీసుల‌కు స‌మాచారం అందింది.


ముందు ఒక ప్రైవేట్ సంస్ద వార్షికోత్స‌వానికి ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లుగా పోలీసుల‌కు అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులకు ఈ ఈవెంట్ పై స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం అంద‌టంతో ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించారు. మ‌రో వైపున ఈవెంట్ నిర్వాహ‌కులు, మద్యం తాగేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ నుండి కూడా అనుమ‌తి తీసుకున్నారు. పోలీసు అనుమ‌తి  కోసం పొలిటిక‌ల్ ఒత్తిళ్లు తీసుకురావ‌టంతో ఈ వ్య‌వ‌హ‌రంపై పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది.


ఇదే స‌మ‌యంలో గ‌త అనుభ‌వాలు కూడా పోలీసులు ప‌రిగ‌ణనలోకి తీసుకోవ‌టంతో అనుమ‌తి ఇవ్వ‌కుండా పోలీసులు నిరాక‌రించారు. అయితే పోలీసులపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రిగింది. దీంతో కొత్త‌గా వ‌చ్చిన కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఈ వ్య‌వ‌హ‌రంపై స్ప‌ష్టమ‌యిన ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఆహ్వ‌న ప‌త్రిక పై స్ప‌ష్టంగా క్యాసినో, అని ముద్రించిన త‌రువాత అనుమ‌తి ఇవ్వ‌టం సాద్యం కాద‌ని, ఇలాంటి కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎస్పీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.


సంక్రాంతి పండుగ లో క్యాసినో వివాదం
గత సంక్రాంతి పండును పుర‌స్క‌రించుకొని గుడివాడ‌లో జ‌రిగిన కోడి పందాల మాటున కేసినోవా కూడా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హ‌రం రాజ‌కీయంగా తీవ్ర స్దాయిలో దుమారాన్ని లేపింది. అప్ప‌డు మంత్రిగా ఉన్న కొడాలి నాని త‌న క‌ళ్యాణ మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించార‌ని ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అయ్యాయి. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్దాయిలో ఆందోళ‌న చేయ‌టంతో సీఎం కూడా ఈ వ్య‌వ‌హ‌రం పై కొడాలి నాని వ‌ద్ద ఆరా తీసిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే కొడాలి నాని మాత్రం త‌న‌ను సీఎం ఏమీ అన‌లేద‌ని టీడీపీ నేత‌లు బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. గోవా క‌ల్చ‌ర్ త‌ర‌హాలో సంక్రాంతి పండుగ నాడు కొడి పందాల మాటున క్యాసినో నిర్వ‌హించార‌ని, అది కూడా అప్ప‌టి మంత్రిగా ప‌ని చేసిన కొడాలి నాని ఇలాఖా అయిన గుడివాడ‌లో జ‌ర‌గ‌టం, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది.


ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఈ విష‌యంపై నిజ‌నిర్దార‌ణ క‌మిటి కూడ వేసి, వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌టం పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ లు చేయ‌టం, గుడివాడ‌లో 144సెక్ష‌న్ ను ఏర్పాటు చేయ‌టంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్దితులు నెల‌కొన్నాయి. ఇంత భారీ స్దాయిలో వివాదం నెల‌కొన‌టంతో పోలీసులు అన‌ుమ‌తులు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది.


క‌న్వెన్ష‌న్ వ‌ద్ద భ‌ద్ర‌త‌
అనుమ‌తి లేకుండా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేయ‌టంతో పోలీసులు క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భ‌ద్ర‌తను క‌ట్టు దిట్టంచేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో అనుమ‌తి లేకుండా ఎటువంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు వీలులేద‌ని నిర్వాహ‌కుల‌తో పాటుగా, యాజ‌మాన్యానికి కూడ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో క‌న్వెన్ష‌న్ పై పోలీసులు నిఘాను ఏర్పాటు చేయ‌టంతో కార్య‌క్ర‌మాన్ని నిర్వహ‌కులు ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింది.