ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రానున్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నారు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 


సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్ల చేస్తోంది. దీనిపై మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు సమీక్ష నిర్వహించారు. కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ నెల 27న  ఉదయం 11 గంటలకు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మఒడి లబ్ధిదారులు హాజరుకానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 


అమ్మఒడి లబ్ధిదారులతో మాట్లాడిన తర్వాత సీఎం జగన్... తితిలి, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. 


ఏర్పాట్లపై సమీక్ష..


సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తలశిల రఘురాం, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక సమీక్షించారు. ముందుగా కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్ కళాశాల మైదానం పరిశీలించారు. అనంతరం హెలీపాడ్ స్థలి, సీఎం పయనించే మార్గం, బహిరంగ సభ, లబ్ధిదారులతో ముఖాముఖీ తదితర వాటిపై చర్చించారు. ఆర్అండ్‌బీ బంగ్లాకు చేరుకుని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 


సీఎం పర్యటన విజయవంతం చేయాలి


అమ్మఒడి మూడో విడత పంపిణీ, మరికొన్ని సం క్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా వస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని సూచించారు. ఆ దిశగా వాళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.