Sharmila to lead Chalo Secretariat on February 22: విజయవాడ: కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుక ముగిసిన తరువాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ గురువారం ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. దాంతో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రరత్న భవన్ కి చేరుకున్నారు. బుధవారం రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. సీనియర్ నేత కేవీపీ నివాసంలో వైఎస్ షర్మిలను సైతం హౌజ్ అరెస్ట్ చేయాలని పోలీసులు చూడటంతో ఆమె ఆంధ్రరత్న భవన్ వైపు మొగ్గుచూపారు. ముందస్తు అరెస్ట్ ల నేపథ్యంలో  ఆంధ్రరత్న భవన్ లోనే  ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు చలో సెక్రటేరియట్ కి పార్టీ శ్రేణులతో కలిసి బయలు దేరనున్నారు. 




నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే  హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? తాను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? అని అడిగారు. మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని  ఆపాలని చూస్తున్నారు అంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం అన్నారు. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.. మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదంటూ ట్వీట్ చేశారు.