Madakasira Mla Disgraced : అనంతపురం (Anantapuram)జిల్లా మడకశిర (Madakasira) నియోజకర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి (Thippeswamy)కి ఘోర అవమానం జరిగింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy ) ని కలిసేందుకు ఎమ్మెల్యే తిప్పేస్వామి వచ్చారు. దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేతో  సజ్జల మాట్లాడకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మడకశిర వ్యవహారంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి...అమరావతికి వచ్చారు. అనుచరులతో కలిసి సచివాలయానికి వెళ్లారు. 


సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్లిపోతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే తిప్పేస్వామి అనుచరులు అడ్డుకున్నారు. తిప్పేస్వామికి వైసీపీ టికెట్ ఇవ్వాలని, కొత్త వారిని బరిలోకి దించితే ఓడిపోతుందని అనుచరులు చెప్పారు. సర్వేల పేరుతో కొత్త వ్యక్తులను పోటీకి దించవద్దంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల తోపులాటలో ఎమ్మెల్యే తిప్పేస్వామి దూరంగా వెళ్లారు. తిప్పేస్వామికి అన్యాయం జరగదని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి...కారు ఎక్కి బయల్దేరారు. పోలీసుల సాయంతో సజ్జల వద్దకు వచ్చిన తిప్పేస్వామి, ఏదో చెప్పబోయారు. నువ్వా...సరే సరే నేను ఫోన్ లో మాట్లాడుతాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి అక్కడి నుంచి అవమానంతో వెనుదిరగాల్సి వచ్చింది. 


వైసీపీకి షాకుల మీద షాకులు


మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీలోనే ఉంటే మునిగిపోతామన్న భయానికి తోడు జగన్ ప్రాధాన్యత కల్పించకపోవడంపై నేతలు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఆ పార్టీలో సీటు రాదని ఫిక్సయిన నేతలు జగన్ కు రాం రాం చెప్పేందుకు వెనుకాడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిని, వైసీపీలో తమకు ఎదురైన అవమానాలపై లేఖలు రాస్తున్నారు. కొందరు బహిరంగంగానే ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ కు నమ్మినబంటుగా ఉన్న వారు కూడా నోటికి పని చెబుతున్నారు.  కొందరు ఇప్పటికే జగన్ కు దూరమయ్యారు. ఇంకొందరు కండువా మార్చేశారు. 


జగన్ పై నేతలు తీవ్ర విమర్శలు


మొన్న విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ, నిన్న ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి జగన్ వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. వాటన్నంటిని జ్యోతుల చంటిబాబు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తో కాకినాడలో సమావేశమైన ఆయన, ఏ క్షణమైనా వైసీపీ గుడ్ బై చెబుతారన్న చర్చ నడుస్తోంది. జగ్గంపేట టికెట్ విషయంలో వైసీపీ హైకమాండ్ నుంచి జ్యోతుల చంటి హామీ లభించకపోవడంతో పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చ ఎన్నికల్లో జగ్గంపేట టికెట్ ను మాజీ ఎంపీ తోట నరసింహం కుటుంబానికి ఇవ్వడం ఫిక్స్ అయింది. దీంతో జగ్గంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, కిర్లంపూడి, గండేపల్లి జడ్పీటీసీలు, కిర్లంపూడి ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతుల చంటిబాబు 2009, 14ల్లో జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.