MP Raghurama krishnam raju on Ambati Rayudu Resign: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) రాజకీయ నాయకుడిగా సెకండ్  ఇన్సింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అధికార వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)లో చేరారు. కానీ ఏమైందో ఏమో వారం తిరక్కముందే... రాజీనామా చేసేశాడు. అసలు... అధికార పార్టీలో ఎందుకు  చేరాడో... ఇప్పుడు రాజీనామా ఎందుకు చేశాడో ఎవరికీ అంతుపట్టడంలేదు. కానీ అంబటి రాయుడు రాజీనామాలు ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా మలుచుకుంటున్నాయి.  నరసాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అంబటి రాయుడు రాజీనామాపై సెటైర్లు ఇచ్చారు.


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) గురించి తెలుసుకునేందుకు తనకు ఆరు నెలలు సమయం పట్టిందని.... కానీ  అంబటి రాయుడు ఆరు రోజుల్లోనే తెలుసుకున్నాడని అన్నారు ఎంపీ  రాఘురామకృష్ణరాజు(Raghuramakrishna Raju). జగన్ వ్యక్తిత్వాన్ని ఇంత తొందరగా గ్రహించాడని.... వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఎంత తప్పుచేసాడో తెలుసుకున్నాడని అన్నారు. అందుకే... ఇలా చేరి.. అలా   బటయకు వచ్చాడని ఎద్దేవా చేశారు రఘురామ. వైఎస్‌ఆర్‌సీపీ మునిగిపోయే నావ లాంటిదని అంబటి రాయుడు తొందరగానే గుర్తించారన్నారు. అందుకే చేరిన వారం  రోజుల్లోనే ఆ పార్టీని వీడారని చెప్పారు. చెడు గురించి ఇంత తొందరగా తెలుసుకున్న అంబటి రాయుడిని తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. 


డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటే బ్యాటింగ్ చేయకుండానే వెనుదిరిగాడేంటని అంబటి రాయుడు అభిమానులు అనుకోవచ్చని... కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమని చెప్పారు ఎంపీ రాఘురావకృష్ణరాజు. ఎంతైనా ఆటగాడు కదా.. రాబోయే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును ముందుగానే అంచనా వేసాడని... ఓడిపోయే మ్యాచ్ ఆడకపోవడమే మంచిదనుకుని రాజీనామా చేశాడని అన్నారు. మునిగిపోతున్న వైసీపీ నావ నుంచి అరక్షణం ఆలస్యం చేయకుండా బయటికి వచ్చేశాడు అని రఘురామ పేర్కొన్నారు. ఒక క్రికెటర్‌గా ఎంత వేగంగా పరుగులు చేశాడో అంతే వేగంగా అంబటి రాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పారు. ఇందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే అని అన్నారు రఘురామకృష్ణ రాజు. ఇక... మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు త్వరలోనే టీడీపీలోగానీ లేదా జనసేన పార్టీలో గానీ చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు నరసాపురం ఎంపీ రాఘురావకృష్ణరాజు. 


వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి రాబోయేది 18 నుంచి 20 స్థానాలు మాత్రమే అని అన్నారు నరసాపురం ఎంపీ (Narasapuram MP). పోటాపోటీగా ఉండే 25 స్థానాల్లో 15 కలుపుకొని వైసీపీకి 35 సీట్లు దక్కుతాయని  గతంలో తాను చెప్పానన్నారు. అయితే... ఇప్పుడు నెల్లూరుకు చెందిన పెద్దారెడ్లు, గుంటూరుకు చెందిన మంచి వ్యక్తులు టీడీపీ, జనసేన కూటమి వైపు వస్తే వైసీపీకి మిగిలేది  18 నుంచి 20 సీట్లు మాత్రమే అని అన్నారు. వారం, పది రోజుల్లో అంబటి రాయుడు తెలుగుదేశంలో పార్టీలో గానీ... జనసేన పార్టీలో గానీ చేరుతారని అన్నారు రఘురామకృష్ణరాజు.


అంబటి రాయుడు వైసీపీలో చేరిన వారం రోజుల లోపే రాజీనామా చేయడంపై ప్రతిపక్ష టీడీపీ(TDP) కూడా క్రికెట్ బాషలోనే ప్రశ్నిస్తోంది. దుష్టుడైన వైఎస్ జగన్‌తో కలిసి పొలిటికల్  ఇన్నింగ్స్ ఆడకూడదని అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం సంతోషకరమైందంటూ ట్వీట్‌ (Tweet) చేసింది టీడీపీ. అంబటి రాయుడు భవిష్యత్ బాగుండాని కోరుకుంటున్నామని  తెలిపింది.