AP Minister visits Kondapalli | విజయవాడ: రాష్ట్రంలోని హస్త కళాకారులకు అన్నివిధాలా తోడ్పాటు అందించి వారికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, చేనేత & జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను సోమవారం ఆమె సందర్శించి, హస్తకళాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ.. హస్తకళాకారుల సమస్యలు తెసుకునేందుకే కొండపల్లికి వచ్చినట్లు తెలిపారు. హస్తకళాకారులు చెప్పిన ప్రతి సమస్యను తమ ప్రభుత్వం తీర్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తక్కువ ధరలకే పనిముట్లు అందిస్తాం
బొమ్మల తయారీకి ఆసక్తి ఉన్నవారికి ఇచ్చే శిక్షణా కార్యక్రమం గడువను ఏడాదికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హస్తకళాకారులకు బొమ్మల తయారీకి కావాల్సిన పనిముట్లను తక్కువ ధరకే లభించేలా చూడడంతో పాటు కళాకారులకు ఉచిత ఇండ్ల పంపిణికి కృషిచేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల కళను ప్రోత్సహించింది శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆయన స్పూర్తితో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొండపల్లి హస్తకళాకారులను ప్రోత్సహించారని గుర్తుచేశారు. మహిళలు కూడా కొండపల్లి బొమ్మల తయారీలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందన్నారు.
హస్తకళాకారులకు అన్ని విధాల తోడుగా ఉండి కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ మార్కెట్ ను పెంచుతామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. లేపాక్షి కేంద్రాల్లో బొమ్మలను కొనుగోలు చేసి సత్కార కార్యక్రమాల్లో బహుకరించాలని అధికారులు, నాయకులను ఆమె కోరారు. కొండపల్లిని టూరిజం హబ్ మార్చి, కొండపల్లి బోమ్మల కొనుగోలును పెంచుతామని వారికి మాట ఇచ్చారు. మంత్రి సవిత పర్యటనలో సబ్ కలెక్టర్ సిహెచ్ భవాని శంకర్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిసిహెచ్ ఏడీ అపర్ణ, ఏపీ హ్యాండ్ క్రాప్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వం, కౌన్సిలర్ చిట్టిబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి ఆర్థిక సాయం
కొండపల్లి పర్యటనలో మంత్రి సవిత పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న పేద కళాకారుడికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. దీంతోపాటు ఆ కళాకారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆమె సూచించారు.
Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్