Gummidi Sandhyarani Family Viral Video: ఏపీ మహిళ, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తమ కుటుంబానికి చెందిన ఓ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సభ్యులు, అనుచరులు తిరుమలలో నాగిని నృత్యాలు వేసి అపచారం చేశారంటూ ఓ వీడియోల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందించారు. 'ఆ వీడియో గత నెల 29న నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని నివాసంలో సెలబ్రేట్ చేసుకున్నది. తిరుమల దర్శనం కోసం వెళ్లినా పద్మావతి గెస్ట్ హౌస్ లో స్టే చేయలేదు' అని అన్నారు. వీడియో వైరల్ చేసిన కుక్కలను భగవంతుడే శిక్షిస్తాడని అన్నారు.


గుమ్మిడి సంధ్యారాణి కుటుంబం తిరుమలలో నాగిని డ్యాన్సులు చేసిందంటూ ఓ వీడియోను ప్రత్యర్థి వర్గం విపరీతంగా వైరల్ చేస్తోంది. పవిత్రమైన తిరుమలలో నాగిని డాన్సరులతో అపవిత్రం చేస్తున్నారని విమర్శించారు. దీంతో నెటిజన్లు కూడా ఈ వీడియో తిరుమలలోదే అయి ఉంటుందని భావించారు. తాజాగా గుమ్మిడి సంధ్యారాణి వివరణ ఇవ్వడంతో దీనిపై స్పష్టత ఇచ్చినట్లు అయింది.


నారా లోకేశ్ క్లారిటీ
దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. ‘‘ఫేక్ జగన్ నువ్వు మారవు.. నీ ఫేక్ మూకలు అస్సలు మారరు.. ఫేక్ చేసి చేసీ 151 నుంచి 11కి వచ్చావు.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయవాడ ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిపినట్టు నువ్వు ఫేక్ ప్రచారం చేస్తున్నావు.. శ్రీవారితో పెట్టుకోవద్దు.. ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు.. ఒక్క సీటు కూడా లేకుండా పోతావ్’’ అని నారా లోకేశ్ పోస్ట్ చేశారు.