AP Minister Chelluboina Venugopal Comments on Investments: ఓ వైపు ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అని చెబుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలని, దానివల్లే అందరికీ ప్రయోజనం అని చెబుతోంది. రాజధాని అంశం రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారగా, రాజధానిని చూసి ఏ రాష్ట్రంలోనూ పెట్టుబడులు రావంటూ ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఏపీ రాబట్టిందని, పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుందన్నారు. దేశ జీడీపీ కంటే రాష్ట్ర జీఎస్‌డీపీ (11.34 శాతం) అధికంగా ఉందని మంత్రి అన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం చాలా ముందు ఉందని స్పష్టం చేశారు.
రాజధానిని చూసి పెట్టుబడులు వస్తాయా ?
ఏ రాష్ట్రంలోనైనా రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు. పరిపాలన చూసి పెట్టుబడులు పెడతారని, అందుకు ఏపీనే ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతే రాజధాని అన్నారు. ఒక రాజధానినే కొనసాగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయం, ప్రజల అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం శివరామకృష్ణ కమిషన్​ వేశారు. కానీ ఆ కమిషన్​చెప్పిన విషయాలను, సూచనలను పట్టించుకోకుండా తనకు కావాల్సిన తీరుగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తనకు కావాల్సిన విధంగా కమిషన్ నియమించి, తనకు నచ్చినట్లుగా రాజధాని నిర్మాణం మొదలుపెట్టి.. అందరూ అది ఒప్పుకోవాలని బలవంతం చేయడం సరికాదన్న్నారు మంత్రి వేణుగోపాల్.


ఏపీలో పెట్టుబడులకు ఏ ఇబ్బంది లేదన్న మంత్రి 
కరోనా వ్యాప్తి సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల వృద్ధి రేటు మైనస్​లోకి వెళ్లినప్పుడు కూడా ఏపీ మంచి వృద్ధి నమోదు చేసిందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం పెరిగిందని మంత్రి వేణుగోపాల్ వెల్లడించారు. 2022 జూలై చివరి నాటికి ఏపీకి రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 1.71 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తే అందులో అత్యధికంగా ఏపీకే వచ్చాయన్నారు. ఏపీ పారిశ్రామిక విధానం వల్ల దేశ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.


రాజధానికి, పెట్టుబడులకు ముడి పెట్టవద్దని సలహా 
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రూ. 23,985 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉందని, అలయన్స్ టైర్స్ సంస్థ రూ.1040 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్​ను రాష్ట్రం సాధించిందని చెప్పారు. రాజధానిని చూసి పెట్టుబడులు రాబట్టలేమని, రాష్ట్ర ప్రభుత్వ పాలన చూసి ఇన్వెస్టర్లు పెట్టబడి పెట్టేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో విశాఖ సైతం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.