Manda Krishna Madiga house arrested: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డెక్కారు. వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు ఎమ్మార్పీఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో, వారికి మద్దతుగా, తమ నేతల్ని విడిచిపెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నేతలకు మద్దతుగా నిరసనకు వెళ్లకుండా పోలీసులు అంబర్‌పేట ప్రాంతంలోని ఆయన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అరెస్టైన ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ, తెలంగాణ సీఎంలు, డీజీపీలను మందకృష్ణ మాదిగ కోరారు. మాదిగల ఓటు అడిగే నైతిక హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్సీలను వర్గీకరణ చేయాలని, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూపులు తప్ప తమకు న్యాయం జరగడం లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్సీల కోసం పార్లమెంట్ లో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీలకు సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ ధర్నా రక్తసిక్తమైంది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ నాయకులు ఆందోళన చేయడం... వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి హీటెక్కింది. రాళ్లు రువ్వుకునే పరిస్థితి తలెత్తింది. వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ఎమ్మార్పీఎస్ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ యడ్రాతి కోటేశ్వరరావు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీ జన సమూహంతో కీసర గ్రామంలో నేషనల్ హైవే మీద చేసిన ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాధ్, మహిళా నాయకురాలు జ్యోతి , గుండాల ఈశ్వరయ్య గుండాల ఈశ్వరయ్య, శివ నారాయణ, కత్తి ఓబులేసు, గజ్జల బాలయ్య, మారన్న, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మంత్రులకో న్యాయం ? మాదిగలకో న్యాయమా...???
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తే నిర్బంధం లేదు. మరో మంత్రి జగదీష్ రెడ్డి జాతీయ రహదారి దిగ్బంధం చేస్తే నిర్బంధం లేదని.. మరి మాదిగల విషయంలోనే ఎందుకీ వివక్ష అని ఎమ్మార్పీఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు జాతీయ రహదారుల మీద దిగ్బంధం చేస్తే నిర్బంధం లేదని, మాదిగ బిడ్డలు చేస్తేనే ఎందుకు నిర్బంధం పెట్టారని ప్రశ్నించారు. మంత్రులకో న్యాయం ? మాదిగలకో న్యాయమా...? కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తోందని MRPS రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ ఆరోపించారు.