గణతంత్ర దిన వేడుకలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇందుకు వేదికైంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల తరపున శకటాల ప్రదర్శన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే హైటీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ ఏపీలో ప్రభుత్వ పథకాల గురించి ప్రశంసించారు.
కుల, మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అన్ని పథకాలు బాగున్నాయని అన్నారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్ఠికాహారం అందుతోందని అన్నారు. డీబీటీ ద్వారా నవరత్నాలు, అమ్మ ఒడి పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని అన్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్ కిట్ అందిస్తున్నారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సీబీఎస్‌ఈ సిలబస్ అందిస్తున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బిశ్వభూషణ్ అన్నారు.
‘‘వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఇప్పటికే సంచార పశు వైద్య క్లినిక్‌లు ప్రారంభించారు. త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నామని అని గవర్నర్ చెప్పారు.
ఉదయం ఏడు గంటలకే తెలంగాణలో
తెలంగాణ రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభం అయ్యాయి. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతి కుమారి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం నుంచి మంత్రులు, ఇతరులు ఎవరూ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రసంగం చివర్లో కూడా గవర్నర్ తెలుగులో మాట్లాడుతూ ముగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందామని అన్నారు.
కొంత మందికి నేను నచ్చకపోవచ్చు - తమిళిసై
‘‘కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు - నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం - రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను.’’ అని గవర్నర్ తమిళిసై మాట్లాడారు.