Book Festival In Vijayawada: విజయవాడ పుస్తక మహోత్సవం (Vijayawada Book Festival) కొంచెం ముందుగానే ప్రారంభం కానుంది. ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నట్లు విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ అధ్యక్షుడు (Vijayawada Book Festival Committee President) టి.మనోహర్‌నాయుడు (Manohar Naidu) వెల్లడించారు. మంగళవారం విజయవాడలో సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్, ఏపీ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ (AMd Imtiaz)లతో కలిసి ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. ఏటా జనవరి 1 నుంచి 11 వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబరు 28 నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రచురణకర్తలు, పుస్తక పంపిణీదారులు పాల్గొంటారని చెప్పారు. పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, పుస్తకప్రియుల పాదయాత్ర ఉంటాయన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని వివరించారు.
జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభం
విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ పుస్తక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణధికారి ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. అనంతరం వివిధ విభాగాలలో అమర్చిన పుస్తకాలను సందర్శించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికి నచ్చే, మెచ్చే గ్రంథాలు, వందలాది కొత్త పుస్తకాలు పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుగుతందని, విజయవాడలో పుస్తక వారోత్సవాలు జరగడం అభినందనీయమన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి నిర్వాహకులు పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పుస్తక పఠనం మంచి అలవాటని, పుస్తకాలు చదవటం ద్యారా విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. అన్ని రకాల పుస్తకాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని, పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పుస్తక ప్రదర్శనను ప్రారంభించామని సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు తెలియజేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటి రీసెర్చి లైబ్రరీ ఆవరణలో ఈ జాతీయ పుస్తక వారోత్సవాలు జరుగుతున్నాయని, సాహితీ వేత్తలు, పుస్తక ప్రియులు, కళాకారులు, రచయితలు, మేథావులు, విద్యార్థులు పుస్తక వారోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.