Andhra Pradesh: 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. మెమోలు అందుకున్న ఐపీఎస్ అధికారులందరూ వెయిటింగ్‌లో ఉన్నవారే. వారందరూ రోజూ హెడ్ క్వార్టర్‌లో వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. మెమోలు అందుకున్న వారిలో పీఎస్సార్ ఆంజనేయులు, విశాల్ గున్ని, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు ఉన్నారు. వీరంతా ఇకపై రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా రోజూ హెడ్ క్వార్టర్‌లోనే రిపోర్టు చేయాలని డీజీపీ మెమోలో పేర్నొన్నారు.
మెమోలు అందుకున్న ఐపీఎస్ అధికారులంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేసినవారే కావడం గమనార్హం. చంద్రబాబు సీఎం అయ్యాక వీరందరికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. పీ సీతారామంజనేయులు గత ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఈయన చంద్రబాబు సీఎం అయ్యాక రెండు సార్లు కలిసేందుకు ప్రయత్నించినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. సునీల్ కుమార్ ఏపీ సీఐడీ డీజీగా పనిచేశారు. ఐపీఎస్ రిశాంత్‌రెడ్డి చిత్తూరు ఎస్పీగా పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని గతంలో టీడీపీ నాయకులు ఆయనపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. రఘువీరారెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేశారు.
ఐపీఎస్ పాలరాజు జగన్ ప్రభుత్వంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేశారు. అంతకుముందు డీజీపీ ఆఫీసులో ఉంటూ దిశ యాక్ట్ అమలు బాధ్యతలను చూసేవారు. విశాల్ గున్ని గత ప్రభుత్వంలో విశాఖ డిఐజీగా పనిచేశారు. రూరల్ ఎస్పీగా పనిచేసిన విజయరావుతో కలిసి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూశాడని ఆయనపై టీడీపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత ఇష్టమైన పోలీస్ అధికారి. ఆయన్ను సిట్ బృందానికి హెడ్‌గా నియమించింది గత ప్రభుత్వం. అమరావతి భూ కుంభకోణాలపై ఆయన దర్యాప్తు జరిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను ఎన్నికల కమిషన్ అస్సాంకు పోలీస్ అబ్జర్వర్‌గా బదిలీ చేసింది. కాంతిరాణా టాటా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను ఆయనే ఛేదించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యాక పోస్టింగ్ దక్కని ఈ 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులంతా ఏదో విధంగా టీడీపీతోనో సీఎం చంద్రబాబుపై కేసుల విషయంలోనో, కుంభకోణాల దర్యాప్తులోనూ కీలకంగా వ్యవహరించిన వారే.. వీరందరికీ ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా చంద్రబాబు ఖాళీగా ఉంచారు. తాజాగా రోజూ హెడ్ ఆఫీస్‌లో వచ్చి రిపోర్టు చేయాలని డీజీపీ మెమో ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
Also Read: మైనర్ బాలికను పరువు కోసం చంపారా? లేక ఆత్మహత్యా?
Also Read: కొలిక్కిరాని దువ్వాడ కుటుంబ పంచాయితీ, శ్రీనివాస్ మంచి నటుడని మాధురి కామెంట్