Pawan Kalyan: సినిమాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కంకిపాడులో నిర్వహించిన పల్లె పండగ పంచాయితీ శాఖ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమాల గురించిన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పల్లె పండగ గురించి మాట్లాడుతున్న టైంలో ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రసంగం ముగించే టైంలో ఆ నినాదాలపై స్పందించారు. 


అభిమానులు ఓజీ ఓజీ అంటూ ఉంటే తనకు మోదీ మోదీ అన్నట్టు వినిపిస్తుందన్నారు పవన్ కల్యాణ్. అసలు ముందుగా కడుపు నిండే పనులు చేద్దామన్నారు. ముందు కడుపు నిండితే తర్వాత వినోదాలు, విందులు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. చేతిలో డబ్బులు ఉంటే కదా ఇష్టమైన నటుడు సినిమాకు వెళ్లొచ్చని అని తెలియజేశారు. మీరు సినిమాకు వెళ్లాలన్నా రోడ్లు బాగుండాలి అందుకే పల్లె పండగను తీసుకొచ్చామన్నారు పవన్ కల్యాణ్. ముందు బాధ్యత నెరవేర్చిన తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దామన్నారు. 


సినిమాల్లో ఉండే ఏ హీరోతో కూడా పోటీ పడనని అన్నారు పవన్ కల్యాణ్. ఒకొక్కరు ఒక్కో డివిజన్‌లో నిష్ణాతులని కితాబు ఇచ్చారు. బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాని, మహేష్‌, ఎన్టీఆర్‌ ఎవరైనా బాగుండాలని కోరుకుంటానన్నారు.  ఇలా ఎవరికి జై కొట్టాలన్నా ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టి మీకు పని, స్కిల్‌డెవలప్‌మెంట్ కల్పించిన తర్వాత విందులు వినోదలు చేద్దామన్నారు. 


కొత్తగా అధికారంలో కీలక బాధ్యతలు తీసుకున్న పవన్ కల్యాణ్‌ వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. టైం దొరికినప్పుడు షూటింగ్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవైపు ఓజీ, మరోవైపు హరిహరవీరమల్లు సినిమాలను పట్టాలెక్కించారు. కీలకమైన సెట్స్‌ వేసి వీలు కుదిరినప్పుడల్లా సినిమా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖలు తన పోర్టుఫోలియోలో ఉన్నందు పవన్ ఏ మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. ఎక్కువ టైం తన శాఖల్లో జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ చేస్తున్నారు. రివ్యూలు, ఇతర కీలక ప్రాజెక్టుల అనుమతులు, కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఖర్చు అవుతున్న విధానంపైనే దృష్టి పెడుతున్నారు.  


మొన్నీ మధ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామసభల కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజక వర్గంలోని మైసూరువారిపల్లిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన... సినిమాల కన్నా సమాజం ముఖ్యమనీ సినిమాల కన్నా దేశం ఇంకా ముఖ్యమనీ తెలిపారు. అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయని... తాను సినిమాలు, రాజకీయాలను వేరు వేరుగా చూస్తా అన్నారు. 


పవన్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న OG సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ సినిమాను కంప్లీట్ చేస్తున్నట్టు సమాచారం. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌ల కోసం దర్శకులు ఎదురు చూస్తున్నారు వీరమల్లుకు డేట్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి సంతకాలు చేసిన సినిమాలను ముందుగా కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు పవన్. 


Also Read:పాలనలో చంద్రబాబే ఆదర్శనం- జట్టు కట్టిన ఫలితం రాష్ట్ర ప్రగతిలో కనిపిస్తోంది- పల్లె పండగలో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్