Donations for flood victims in AP and Telangana | విజయవాడ/ తిరుపతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు అమర రాజా గ్రూప్ ముందుకొచ్చింది. అంతర్జాతీయ వ్యాపార సంస్, అమర రాజా గ్రూప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరద సహాయక చర్యలకు తమ వంతు సహాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1 కోటి విరాళాలు అందించింది అమర్ రాజా సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ఆ సంస్థ ఆపన్న హస్తం అందించింది.


అమరరాజా గ్రూపు (Amara Raja Group) సహ వ్యవస్థాపకురాలు గల్లా అరుణ కుమారి, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ విరాళాలకు సంబంధించిన రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.


వారు త్వరగా కోలుకోవాలని గల్లా జయదేవ్ ఆకాంక్ష


అమర రాజా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ.. "వరదల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఊహించని ఈ వరదల కారణంగా సంభవించిన విధ్వంసం లెక్కలేనన్ని కుటుంబాలను, ఎంతో మంది జీవనోపాధిని ప్రభావితం చేసింది. ఇంతకాలం మాకు మద్దతుగా ఉన్న వారిని ఆదుకోవడం మా కర్తవ్యంగా అమర రాజా భావిస్తోంది. ఈ కష్ట కాలంలో మేం అందిస్తున్న ఈ విరాళం, వరద బాధితులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగం. వరదల వల్ల  ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలి. వరద బాధితుల పునరావాసానికి తమ సాయం దోహదపడుతుందని’ ఆకాంక్షించారు.




ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన పలువురు ప్రముఖులు


భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మరికొందరు ముందుకొచ్చారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఎస్వీ యూనివర్సిటీ (SV University) ఇంఛార్జ్ వీసీ సీహెచ్.అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నేతృత్వంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయ, శాశ్వత ఉద్యోగులు, టైం స్కేల్ ఉద్యోగులు, NMR ఉద్యోగులు, టీచింగ్ అసిస్టెంట్స్, పెన్షనర్లు కలిపి రూ.47,46,380 విరాళం అందించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, అమలాపురానికి చెందిన చెరుకూరి రామచంద్రరావు రూ.5 లక్షల చొప్పున సాయం చేశారు.


హైదరాబాద్ కు చెందిన బొటిక్ నిర్వాహకురాలు ఎమ్.సునీత రూ.2,35,000, గుంటూరుకు చెందిన శ్రీరంగ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు రామస్వామి రూ.1,11,111, విజయవాడ నిడమానురుకు చెందిన లాల్ బీ రూ.55,555, హైదరాబాద్ కు చెందిన పొట్లూరి సాయి నాగార్జున రూ.50 వేలు విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వారందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు బిగ్ గుడ్‌న్యూస్ - భారీగా ఆర్థిక సాయం ప్రకటన