Chandrababu Latest News: విజయవాడ వరద బాధితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేలు పరిహారం రూపంలో ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంతేకాక, నష్టపోయిన పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. వారి టర్నోవర్ ను బట్టి సాయం చేయాలని భావిస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
ఎవరెవరికి ఎంత?
భారీ వర్షం, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. వరదకు ప్రభావితం అయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని.. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ.10 వేలు, చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక టూవీలర్స్ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు, ఆటో వంటి మూడు చక్రాలు ఉండే వాహనాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని అన్నారు. బైక్‌ల ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి 9 వేలకు పైగా క్లెయిమ్‌లు ఇప్పటికి పరిష్కరించినట్లు చంద్రబాబు తెలిపారు. బైక్‌లకు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌లు చేశారని.. అందుకు రూ.6 కోట్లు చెల్లించామని.. మరో 6 వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
పరిశ్రమలకు కూడా
చేనేత కార్మికులకు రూ.15 వేలు, నష్టపోయిన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)ల్లో రూ.40లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వాటికి రూ.లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కోళ్ల విషయంలో ఒక్కో కోడికి రూ.100, కోళ్ల ఫారం షెడ్డు డ్యామేజీ అయితే రూ.5 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7,500, ఎడ్ల బండి కోల్పోతే వారికి కొత్తవి అందజేస్తామని చంద్రబాబు చెప్పారు.
వ్యవసాయంలో..
పంట నష్టపోయిన వారిలో ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగకు రూ.15 వేలు, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు కూడా రూ.15 వేలు.. పసుపు, అరటికి రూ.35 వేలు.. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోట్, వల పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు ఇస్తామని సీఎం వివరించారు. సెరీ కల్చర్‌కు రూ.6 వేలు. గేదెలకు రూ.50 వేలు. వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
వీరికి మాత్రమే ఆర్థిక సాయం
తాను ప్రకటించిన ఆర్థిక సాయం మొత్తం ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వారికే చెందుతుందని చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఇంటి యజమానికి ఆర్థిక సాయం చెందబోదని అన్నారు. ఒకవేళ ఇల్లు దెబ్బతిన్న పక్షంలో ఇంటి యజమానిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పంట పొలాలకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా కౌలుకు చేస్తున్న రైతుకు మాత్రమే నష్టపరిహారం వెళ్తుందని చంద్రబాబు చెప్పారు. నిజంగా నష్టపోయిన వారికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేరాలని చంద్రబాబు ఆకాంక్షించారు.