Tirupati Laddu Dispute: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని సున్నితమైన ఈ అంశంపై లోతుగా విచారణ చేస్తున్నాని తెలిపారు చంద్రబాబు. టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు. 


రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని జగన్‌పై మండిపడ్డారు. అందులో భాగంగానే తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా కలుగుజేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో నెయ్యి కిలో 600 రూపాయలుపైన అమ్ముడవుతుంటే తిరుమలకు కేవలం 320లకు ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలో తనిఖీలు చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. 


లడ్డూ వ్యవహారం అనేది చాలా సున్నితమైన అంశంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై వేద పండితులు మఠాధిపతులతో చర్చలు కూడా జరుపుతామన్నారు. 


తాను ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానన్నారు చంద్రబాబు. ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని తన చిన్నతనంలో ఇంటి దగ్గర నుంచి చూస్తే తిరుమల కొండ కనిపించేదని చెప్పుకొచ్చారు. అలా చాలా మందికి ఆ నమ్మకం ఉందని అలాంటి వారందరి మనోభావాలను జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాముడు తల నరికే ఎన్నో దుస్సాహసాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.