Tirumala Tirupati Laddu Issue: నిన్న మొన్నటి వరకు జగన్, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేవి. సోషల్ మీడియాలో కూడా వైసీపీ, టీడీపీ మధ్యే గొడవలు జరిగేవి. ట్రోలింగ్ కానీ, కౌంటర్లు కానీ ఎక్కువగా వైసీపీ, టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల మధ్యే ఉండేవి. రెడ్ బుక్ గొడవ కూడా ఈ రెండు పార్టీల మధ్యే. జగన్ ట్వీట్ వేస్తే వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ పడేది, ఆ ట్వీట్ కి మళ్లీ వైసీపీ రియాక్ట్ అయ్యేది. ఇలా ఈ ఎపిసోడ్ లు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బీజేపీ కూడా జగన్ ని టార్గెట్ చేసింది. బీజేపీ నేతలకు సగం తెలుసు, సగం తెలియదు అంటూ జగన్ చేసిన కామెంట్లు ఆ పార్టీ నేతలకు మంటపెట్టాయి. దీంతో ఏపీ బీజేపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. జగన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు టీడీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లు ఇలాంటి కామెంట్లు పెట్టేవి. ఇప్పుడు బీజేపీ కూడా జగన్ పై సెటైర్లు స్టార్ట్ చేసింది. 






అసలు జగన్ ఏమన్నారు..?
"మన ఖర్మ ఏంటంటే.. బీజేపీ వాళ్లకి సగం తెలుసు, సగం తెలియదు. టీటీడీ బోర్డులో బీజేపీలోని సీనియర్లు కూడా సభ్యులుగా పనిచేశారు. ఈ ప్రొసీజర్లన్నీ వారికి తెలియనివి కావు. తెలియకపోతే తెలుసుకోమనండి. బీజేపీ నిజంగానే హిందువులకు నిజాయతీగా ప్రాతినిధ్యం వహించే పార్టీ అయితే.. ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఆ ధైర్యం బీజేపీకి ఉందా..?" అని జగన్ ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన ఆయన పరోక్షంగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి ప్రస్తావిస్తే.. దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థిస్తూ వైసీపీని టార్గెట్ చేయడం సరికాదన్నారు జగన్. 






జగన్ కోపానికి కూడా కారణం ఉంది. గతంలో బీజేపీ నేతలెవరూ నేరుగా జగన్ ని కామెంట్ చేయలేదు. ఏపీలో కూడా ఫైట్ టీడీపీ వర్సెస్ వైసీపీగానే సాగింది. తొలిసారిగా బీజేపీ నుంచి జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కర్నాటకకు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందువులు కానీ వారిని నియమించారని ఆమె అన్నారు. టీటీడీకి చెందిన విద్యాసంస్థల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఫోటోలు తొలగించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా ఆమె ఆరోపించారు. లడ్డూల తయారీకోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని అన్నారు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఘాటుగా స్పందించడంతో జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీని టార్గెట్ చేయాల్సి వచ్చింది. నిజానిజాలు తెలుసుకుని చంద్రబాబుపై అక్షింతలు వేసే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు జగన్. 


Also Read: లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం హిందూ ధర్మంపై కుట్ర - కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ


దీంతో ఏపీ బీజేపీ నేరుగా జగన్ ని టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్ లో జగన్ కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడిన విషయాన్ని బీజేపీ హైలైట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఏంటో మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు! అంటూ ట్వీట్ వేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువులపై జగన్ కి ఎందుకంత పగ అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. మొత్తమ్మీద టీడీపీతోపాటు బీజేపీ కూడా ఇప్పుడు జగన్ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టయింది.