Posani Krishna Murali Latest News: రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన పోసాని కృష్ణమురళికి షాక్‌ల మీద షాక్‌లు తగలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అయినందున బెయిల్ వచ్చినా ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విషయం అర్థమైన పోసాని కోర్టు హాలులో కన్నీటి పర్యంతమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగానే ఆయన తన బాధను వెల్లగక్కారు. 


కక్ష పూరితంగానే తనపై కేసులు పెడుతున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో రిమాండ్‌పై ఇరు పక్షాల వాదనల అనంతరం పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టినందుకు ఇన్ని కేసులు పెడతారని తనకు తెలియదన్నారు. 


70 ఏళ్ల వయసులో తనను అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని... తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడంలేదని వాపోయారు. అన్యాయంగా వాదనలు వినిపిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తనకు లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. 


ఇప్పటికే రెండుసార్లు స్టంట్లు వేశారని గొంతు చికిత్స కూడా జరిగిందని ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని వాపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నంది అవార్డులపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చెప్పారు. తాను తప్పు చేసినట్టు తేలితే నరికేయాలని అన్నారు. పార్టీ మారలేదనే కక్షతో ఈ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.  


పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో ఆయన అరెస్ట్‌ చేశారు.


ఈ కేసుల్లో కర్నూలు జైలు నుంచి విడుదలైన వెంటనే సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకున్నారు. పిటి వారింటీపై గుంటూరు జిల్లాకు తరలించారు. ఆదోని త్రీ టౌన్ కేసులో అరెస్ట్ అయి పోసాని ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జిల్లా జైలులో ఉంటున్నారు. వర్చువల్‌గా కాకుండా ఫిజికల్‌గా హాజరుపరచాలని చెప్పడంతో గుంటూరు జిల్లాలో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. సీఐడీ పోలీసులు జారీ చేసిన పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని పోసాని తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో పోసాని ఈ కేసుల్లోనూ బెయిల్ వచ్చే వరకూ జైల్లో ఉండాల్సి ఉంటుంది.   


వైసీపీ నాయకుడిగా ఉన్న టైంలో పోసాని కృషమురళి ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ను వారి కుటుంబాలను, పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిపై పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి ముందే గమనించిన పోసాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులతో అరెస్టు చేశారు.  ఇలా వివిధ ప్రాంతాల్లో నమోదు అవుతున్న కేసులు పోసానిని కంగారు పెడుతున్నాయి.